POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 06 November 2026, 10:36 am Posted by : POLITICAL POWER

అంకమ్మ చెరువుకు తక్షణ మరమ్మతులు చేపడతాం: మంత్రి తుమ్మల

నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన తుమ్మల.. పెద్దవాగు ప్రాజెక్టుపై ఏపీ సీఎం చంద్రబాబుతో మరోసారి సమావేశం

పొలిటికల్ పవర్,అశ్వారావుపేట ఆర్సి ఇంచార్జ్ ఎం. నాగార్జున: మురసు తుఫాన్‌ కారణంగా తెగిపోయిన అశ్వారావుపేట సమీపంలోని అంకమ్మ చెరువును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం వేకువజామున స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణతో కలిసి పరిశీలించారు. చెరువుకు గండి పడటంతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. తెగిపోయిన చెరువుకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి, తిరిగి రైతులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా అక్కడి నుంచే రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి అంకమ్మ చెరువు మరమ్మతులపై చర్చించారు. ఇటీవల తుఫాన్‌ కారణంగా దెబ్బతిన్న రహదారులు, చెరువులకు త్వరితగతిన మరమ్మతులు చేపడతామని తుమ్మల తెలిపారు.

అలాగే పెద్దవాగు ప్రాజెక్టు సమస్య పరిష్కారంపై స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును మరోసారి కలుస్తానని వెల్లడించారు. స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణను వెంట తీసుకెళ్లి, పెద్దవాగు ప్రాజెక్టు అంశంపై త్వరలోనే చంద్రబాబుతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ రమేష్‌తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, సీనియర్‌ నాయకులు, మంత్రి తుమ్మల అభిమానులు పాల్గొన్నారు.