పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ జూన్ 25 2026: ఇటీవల థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో నిర్వహించిన అంతర్జాతీయ తైక్వాండో క్రీడా పోటీల్లో వనపర్తి జిల్లాకు చెందిన క్రీడాకారుడు సానే వినోద్ కుమార్ రెడ్డి రెండు బంగారు పతకాలు, ఒక కాంస్య పతకాన్ని సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచారని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. వనపర్తి మండలం మాజీ ఎంపీపీ సానే కిచ్చారెడ్డి కుమారుడైన సానే వినోద్ కుమార్ రెడ్డి ఈ ఘనత సాధించడం ద్వారా దేశంతో పాటు వనపర్తి జిల్లా, మండలం, గ్రామానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్యార్థులు, యువత ఉన్నత విద్యతో పాటు క్రీడలపైనా దృష్టి సారిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశాలు మెండుగా ఉంటాయని ఆయన సూచించారు. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న తన కార్యాలయంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, సానే వినోద్ కుమార్ రెడ్డిని శాలువాతో సత్కరించి అభినందించారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి దేశానికి మరింత కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు.