POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 20 June 2026, 8:24 pm Posted by : POLITICAL POWER

అంతర్జాతీయ యోగా దినోత్సవం : విశ్వశాంతిలో స్కూల్ లో యోగా అవగాహన

యోగాతో ఆరోగ్యం –ఆరోగ్యంతో ఆనందం 

మనదేశం అందించిన గొప్ప వరం యోగ.

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ రిపోర్టర్ ఏ హరిబాబు జూన్ 20 2026: ఖమ్మం జిల్లా సత్తుపల్లి, జూన్ 20: అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) పురస్కరించుకుని స్థానిక విశ్వశాంతి విద్యాలయంలో శనివారం విద్యార్థులకు యోగా ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు రాజరత్నాచారి పాల్గొని యోగా యొక్క విశిష్టతను వివరించారు. యోగా అనేది శరీరం, మనస్సు, ఆత్మలను సమతుల్యంగా ఉంచే భారతదేశపు గొప్ప సంప్రదాయమని ఆయన పేర్కొన్నారు. నేటి వేగవంతమైన జీవితంలో విద్యార్థులు చదువుతో పాటు మానసిక ఒత్తిడిని కూడా ఎదుర్కొంటున్నారని, అలాంటి పరిస్థితుల్లో యోగాభ్యాసం ఎంతో అవసరమని తెలిపారు. యోగాను క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని విద్యార్థులకు వివరించారు. ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన జీవితం గడపవచ్చని సూచించారు. ప్రతి విద్యార్థి రోజూ కనీసం 20 నిమిషాల పాటు యోగాభ్యాసం చేయాలని సూచించారు. యోగా అనేది భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప వరమని పేర్కొంటూ, ఆరోగ్యకరమైన భారతదేశ నిర్మాణంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. యోగా ఆసనాలను ప్రదర్శించి విద్యార్థులకు ప్రాక్టికల్ శిక్షణ అందించారు.