POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 23 August 2026, 9:36 pm Posted by : POLITICAL POWER

అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాపై కఠిన చర్యలు

రాత్రివేళల్లో ప్రత్యేక నిఘా.. ఇప్పటికే 4 టిప్పర్లు, 2 ట్రాక్టర్లు సీజ్

అడ్డాకుల తహశీల్దార్ కె. శేఖర్

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో  బాజ శేఖర్ ఆగస్టు 23 2026: హబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలంలో అక్రమ ఇసుక తవ్వకాలు, తరలింపు, అనధికారికంగా ఇసుకను డంపింగ్ చేయకుండా రెవెన్యూ, పోలీస్ శాఖల సమన్వయంతో నిరంతరం నిఘా కొనసాగిస్తున్నట్లు తహశీల్దార్ కె. శేఖర్ తెలిపారు. మండలంలోని వాగు ప్రాంతాల్లో రాత్రి వేళల్లో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపట్టి, ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అయితే అక్రమ ఇసుక రవాణాపై తీసుకుంటున్న చర్యలు ఇప్పటికే నిరంతరంగా అమలు చేస్తున్న చర్యల్లో భాగమేనని స్పష్టం చేశారు. గత రెండు నెలల్లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 4 టిప్పర్లు, 2 ట్రాక్టర్లను సీజ్ చేసి, నిబంధనల ప్రకారం జరిమానాలు విధించినట్లు తహశీల్దార్ తెలిపారు. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు మండలంలోని ఇసుక రవాణాకు అవకాశం ఉన్న ప్రాంతాలు, మార్గాల్లో రాత్రి వేళల్లో రెవెన్యూ సిబ్బందిని ప్రత్యేకంగా విధుల్లో నియమించినట్లు చెప్పారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సిబ్బంది నిఘా నిర్వహిస్తూ, అనుమతులు లేకుండా ఇసుకను తరలించే వాహనాల కదలికలను పరిశీలిస్తున్నారని తెలిపారు. పోలీస్ శాఖ సహకారంతో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇకపై అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వాహనం గుర్తించినట్లయితే వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు, వాహన యజమాని, డ్రైవర్‌పై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ హెచ్చరించారు. అవసరమైన సందర్భాల్లో క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. అదేవిధంగా ప్రైవేట్ లేదా వ్యవసాయ భూముల్లో అనధికారికంగా ఇసుక డంపింగ్ చేసినట్లు గుర్తించినా సంబంధిత అధికారులకు సమాచారం అందించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. పట్టాదారు భూమిలో అక్రమ ఇసుక డంపింగ్ జరుగుతున్న విషయం పట్టాదారుడి ప్రమేయంతో లేదా అనుమతితో జరిగినట్లు తేలితే, నిబంధనల మేరకు రైతుబంధు ప్రయోజనాల రద్దు లేదా నిలుపుదల కోసం సంబంధిత అధికారులకు నివేదిస్తామని తహశీల్దార్ కె. శేఖర్ తెలిపారు. అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణా, అనధికారిక డంపింగ్‌ను పూర్తిగా అరికట్టేందుకు రెవెన్యూ, పోలీస్ శాఖలు సమన్వయంతో నిరంతర నిఘా కొనసాగిస్తాయని ఆయన స్పష్టం చేశారు.