ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై బిసి పొలిటికల్ జేఏసీ మండిపాటు
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక /పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 20 2026: మదనాపురం మండలంలోని అజ్జకొల్లు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బిసి పొలిటికల్ జేఏసీ మండల అధ్యక్షులు బి. మహేందర్ నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. రెండు నెలలు కావస్తున్నా లారీలు అందుబాటులోకి రాకపోవడంతో రైతుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే నిల్వ ఉండిపోయిందన్నారు.
అకాల వర్షాలు పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ధాన్యం తడిసి రైతులకు భారీ నష్టం కలిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వెంటనే ధాన్యాన్ని గోదాములకు తరలించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా సివిల్ సప్లై అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. రైస్ మిల్లర్లు, బుక్ కీపర్లు, లారీ ట్రాన్స్‌పోర్ట్ యజమానుల వ్యవహారంపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. రైస్ మిల్లర్లు తమకు కేటాయించిన ధాన్యాన్ని తీసుకోకుండా తరుగు పేరుతో రైతులను నష్టపరుస్తున్నారని ఆరోపించారు. బుక్ కీపర్లు చెప్పిందే అమలవుతోందని, ఎక్కువ డబ్బులు ఇచ్చిన వారికే లారీలు కేటాయిస్తున్నారని తెలిపారు. కొంతమంది లారీ డ్రైవర్లు కూడా రైతుల వద్ద నుంచి అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. చిన్న, సన్నకారు రైతులు రెండు నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికార యంత్రాంగం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులతో కలిసి బిసి పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.