POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 02 November 2026, 3:25 pm Posted by : POLITICAL POWER

అధికారుల అడ్డగోలు నిర్ణయాలు.. పంచాయతీలో పెరిగిన అవినీతి భారం! – పనిభారంతో ఎంపీడబ్ల్యూల సమ్మె.. కల్వర్టు మోరీలు వేయకుండానే బిల్లుల స్వాహా? – టేకులపల్లి మండలం శంభునిగూడెం పంచాయతీలో దారుణ పరిస్థితి

 

 

టేకులపల్లి, పొలిటికల్ పవర్ (పిఎన్9 న్యూస్ – ప్రతినిధి సత్యప్రసాద్, నవంబర్ 02):

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం శంభునిగూడెం గ్రామపంచాయతీలో అధికారుల తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. పంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్ల (MPW)పై పరిమితికి మించిన అధిక భారం మోపడంతో వారు తట్టుకోలేక గత రెండు నెలలుగా విధులను బహిష్కరిస్తూ విధులకు దూరంగా (బంద్ పాటిస్తూ) ఉన్నారు. అయితే, సమస్యను పరిష్కరించాల్సింది పోయి అధికారులు చేతులెత్తేసి అడ్డగోలు ప్రత్యామ్నాయ చర్యలకు దిగడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

90 రోజులతో నాటకాలు.. ప్రైవేట్ వ్యక్తులతో దోపిడీ!

విధులకు దూరమైన సిబ్బంది స్థానంలో 90 రోజుల ప్రాతిపదికన (90 Days Purpose) ఒకరిని విధుల్లోకి తీసుకున్నారు. అయితే సదరు వ్యక్తి ఉదయం 11 గంటలకే పని ముగించుకుని, మిగతా సమయాన్నంతా సొంత ఆటో నడుపుకోవడానికే కేటాయిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనికితోడు మరో ఇద్దరు ప్రైవేటు వ్యక్తులను అక్రమంగా నియమించి, వారిపైనే గ్రామంలోని రోడ్ల శుభ్రత, బ్లీచింగ్ చల్లడం, చెత్త సేకరణ వంటి పనులన్నింటినీ మోపుతూ తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు.

మోరీలు వేయలేదు.. కానీ బిల్లులు మాత్రం మంజూరయ్యాయి!

పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో కల్వర్టు నిర్మాణం వద్ద అధికారులు చేసిన నిర్లక్ష్యం, అవినీతి భాగోతం ఇప్పుడు గ్రామంలో తీవ్ర చర్చనీయాంశమైంది:

* కల్వర్టు నిర్మాణానికి అవసరమైన రెండు మోరీలను క్షేత్రస్థాయిలో అసలు వేయనేలేదు.

* ఫలితంగా గ్రామంలో మురుగునీరు పోయే దారిలేక రోడ్లపై నిలిచిపోయి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది.

* మోరీలు వేయకుండానే.. పనులు పూర్తయినట్లు చూపి దర్జాగా బిల్లులు డ్రా చేసుకున్నారు!

> ప్రజలు ప్రశ్నిస్తున్నారు:

> “గ్రామాభివృద్ధి కోసం, పారిశుధ్య నిర్వహణ కోసం నికి సరిగ్గా పనిచేసే ఉన్నవారిని తొలగించి/సమ్మెలోకి నెట్టింది ఈ రకంగా అవినీతికి పాల్పడడానికేనా?” అని ఎస్సీ కాలనీ వాసులు, గ్రామస్థులు నిలదీస్తున్నారు.

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, నిధులు బొక్కేస్తున్న అధికారులపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి విచారణ జరిపించాలని, శంభునిగూడెం పంచాయతీలో అక్రమ బిల్లులు పొందిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ‘పొలిటికల్ పవర్’ వేదికగా డిమాండ్ చేస్తున్నారు.