POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 03 September 2026, 10:31 am Posted by : POLITICAL POWER

అధికారుల నిర్లక్ష్యంతో కనుమరుగవుతున్న పాత అంబేద్కర్ గురుకులం

పాత గురుకుల పాఠశాలపై నివేదిక పంపి నెలలు గడుస్తున్నా పట్టించుకోని జిల్లా అధికారులు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9టీవీ తెలుగు న్యూస్ వైయస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్ బ్రహ్మంగారి మఠం మండల కేంద్రం లోని పాత గురుకులాన్ని యధావిధిగా కొనసాగించకపోవడంవల్లే తోట్లపల్లి మహా గురుకులంలో ప్రధాన సమస్యలు తలెత్తుతున్నాయని తక్షణమే పాత అంబేద్కర్ గురుకుల పాఠశాలను యథావిధిగా కొనసాగించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఎఐవైఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి గుడిమె సురేష్ డిమాండ్ చేసారు.అయన మాట్లాడుతూ….పాత అంబేద్కర్ గురుకుల పాఠశాల విషయంలో జిల్లా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎఐవైఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి గుడిమె సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. పాత అంబేద్కర్ గురుకుల పాఠశాల భవనం, వసతులు, విద్యార్థుల అవసరాలపై ఇప్పటికే సంబంధిత అధికారులకు నివేదిక పంపినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. అధికారులు తక్షణమే స్పందించకపోతే చారిత్రక ప్రాధాన్యత కలిగిన పాత గురుకుల పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుని కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పాత గురుకుల పాఠశాలను కొనసాగించకుండా విద్యార్థులను తోట్లపల్లి మహా గురుకులంలో కేంద్రీకరించడం వల్ల అక్కడ విద్యార్థుల సంఖ్య పెరిగి వసతులపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతోందన్నారు. తరగతి గదులు, వసతి గృహాలు, తాగునీరు, మరుగుదొడ్లు, భోజనం, ఇతర మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు అందించాల్సిన ప్రభుత్వమే ఉన్న వసతులను వినియోగించుకోకుండా విద్యార్థులను ఒకే ప్రాంగణంలో కేంద్రీకరించడం సరైన నిర్ణయం కాదన్నారు. పాత అంబేద్కర్ గురుకుల పాఠశాలను పునరుద్ధరించి యథావిధిగా కొనసాగిస్తే తోట్లపల్లి మహా గురుకులంలోని విద్యార్థులపై ఉన్న ఒత్తిడి తగ్గి, రెండు గురుకులాల్లోనూ విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు అందే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందువల్ల జిల్లా ఉన్నతాధికారులు వెంటనే పాత అంబేద్కర్ గురుకుల పాఠశాలను పరిశీలించి, భవనం మరియు మౌలిక వసతుల పరిస్థితిపై సమగ్ర నివేదిక రూపొందించాలని డిమాండ్ చేశారు. పాత గురుకుల పాఠశాలను తక్షణమే యథావిధిగా ప్రారంభించి గురుకులంలోని విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ సమస్యపై అధికారులు మరింత నిర్లక్ష్యం వహిస్తే ఎఐవైఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి ఆందోళన చేపట్టాల్సి వస్తుందని గుడిమె సురేష్ హెచ్చరించారు.