POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 7:43 pm Posted by : POLITICAL POWER

అన్నారం భూ సమస్యపై జిల్లా కలెక్టర్‌కు సుంకరి శివ కుటుంబ సభ్యుల వినతి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 21 2026: పానుగల్ అన్నారం గ్రామానికి చెందిన సుంకరి శివ కుటుంబ సభ్యులు తమ కుటుంబానికి సంబంధించిన భూ సమస్యపై సోమవారం వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ భూమికి సంబంధించిన పలు అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వినతిపత్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం.. సుంకరి రాములు 1994 సంవత్సరంలో అలివేలును వివాహం చేసుకున్నారని, వారికి సుంకరి శివ అనే కుమారుడు ఉన్నాడని తెలిపారు. అనంతరం కుటుంబ విభేదాల కారణంగా అలివేలు తన పుట్టింటి సమీపంలోని శాఖాపూర్‌లో కుమారుడితో కలిసి జీవించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. శివ పెద్దయ్యాక తన తండ్రి సుంకరి రాములను కలిసి కుటుంబానికి న్యాయం చేయాలని కోరగా, అన్నారం గ్రామంలోని 148వ సర్వే నంబర్‌లో ఉన్న భూమిని రెండు కుటుంబాలకు సమానంగా పంచుతానని హామీ ఇచ్చారని వినతిపత్రంలో తెలిపారు. అయితే ఆ తర్వాత భూమి విషయంలో తమకు అన్యాయం జరిగిందని, తమ తండ్రి పేరుపై కొంత భూమిని మాత్రమే ఉంచి మిగిలిన భూమిని రెండో భార్య కాశమ్మ, కుమారుడు నరేష్ పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రశ్నించినప్పటికీ తమకు న్యాయం జరగలేదని తెలిపారు. భూ సమస్యతో పాటు మొదటి భార్య అలివేలుకు భరణం ఇవ్వాలని కోర్టు నుంచి నోటీసులు వచ్చినట్లు వారు పేర్కొన్నారు. అనంతరం సుంకరి రాములు మరణించారని, ఆయన మరణించిన విషయం తమకు ముందుగా తెలియజేయలేదని ఆరోపించారు. అంత్యక్రియలు, దినవారాల కార్యక్రమాల్లో కూడా తమను అడ్డుకున్నారని, ఈ క్రమంలో పోలీసుల సహాయంతో కార్యక్రమాలు నిర్వహించాల్సి వచ్చిందని తెలిపారు. ఈ ఘటనలకు సంబంధించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 148వ సర్వే నంబర్‌లోని భూమి, కుటుంబ ఆస్తికి సంబంధించిన రికార్డులను పరిశీలించి, మొదటి భార్య అలివేలు, కుమారుడు సుంకరి శివకు చట్టపరంగా న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో మేకల రవికుమార్ యాదవ్, మాజీ సర్పంచ్ వీవీ గౌడ్, బీసీ పొలిటికల్ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.