POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 09 November 2026, 6:12 pm Posted by : POLITICAL POWER

అవినీతికి అడ్డాగా కీసర. కీసరలో ఆగని ఖాకీల అవినీతి దందా. రూ.2 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్​ఐ.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్.  మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు.

మేడ్చల్ జిల్లా: కీసర: మల్కాజ్గిరి కమీషనరేట్, కీసర పోలీస్‌స్టేషన్‌లో మరో అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఛార్జిషీట్‌ విషయంలో ఓ వ్యక్తికి అనుకూలంగా వ్యవహరించడంతో పాటు త్వరగా దాఖలు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన ఎస్‌ఐ కొండారెడ్డి శ్రీనివాస్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాధితుడి నుంచి రూ.2 లక్షలు తీసుకుంటుండగా నాగారం పరిధిలోని శిల్పానగర్‌ కాలనీలో సోమవారం ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ వివరాలను హైదరాబాద్ ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ వెల్లడించారు.                                                          రూ.5 లక్షలు డిమాండ్ రూ.2 లక్షలకు ఒప్పందం.కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ వ్యక్తిపై చీటింగ్, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. బెయిల్‌పై ఉన్న సదరు వ్యక్తి కోర్టు ఆదేశాల మేరకు ప్రతి సోమవారం ఠాణాలో హాజరవుతున్నాడు. ఈ క్రమంలో కేసు ఛార్జిషీట్‌లో అతనికి అనుకూలంగా వ్యవహరించడంతో పాటు త్వరగా దాఖలు చేసేందుకు ఎస్‌ఐ కొండారెడ్డి శ్రీనివాస్ రూ.5 లక్షలు డిమాండ్ చేసినట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. అంత మొత్తం చెల్లించలేనని బాధితుడు చెప్పడంతో చివరకు రూ.2 లక్షలకు ఒప్పందం కుదిరింది.

 

నగదు ఇవ్వాలని ఎస్‌ఐ తరచూ ఫోన్‌ చేసి బాధితుడిపై ఒత్తిడి తెచ్చినట్లు వెల్లడించారు. ఎస్‌ఐ వేధింపులతో విసిగిపోయి, ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు తెలిపారు. వారి సూచనల మేరకు లంచం నగదును ఓ కవర్‌లో పెట్టుకుని నాగారం పరిధిలోని శిల్పానగర్‌ కాలనీకి వెళ్లాడు. అక్కడ ఎస్‌ఐ రూ.2 లక్షలు స్వీకరిస్తుండగా ఏసీబీ బృందం దాడి చేసి పట్టుకుంది. అనంతరం ఎస్‌ఐను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు చర్యలు చేపట్టినట్లు ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ వెల్లడించారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు భయపడకుండా ఏసీబీ టోల్‌ఫ్రీ నంబరు 1064 కు ఫిర్యాదు చేయాలని డీఎస్పీ గంగసాని శ్రీధర్ సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.