
*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*
వైయస్ఆర్ సీపీని గెలిపిస్తే ప్రజలకు జవాబుదారీగా ఉంటాం. ప్రజల ఆస్తులకు రక్షణగా మేమంతా నిలుస్తాం. రెండున్నరేళ్లుగా ఎమ్మెల్యే, అనుచరుల అరాచకాలు, ఓటు ద్వారా బీజేపీ, టీడీపీ, జనసేనకు బుద్ధి చెప్పండి..ఎన్నికల ప్రచారంలో వైయస్ఆర్ సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత గారు
27, 28, 29, 49, 50 డివిజన్లలో మేయర్ అభ్యర్థి రమేష్‌గౌడ్ గారితో కలిసి ప్రచారం
దౌర్జన్యకారులు, అవినీతిపరుల నుంచి అనంతపురం నగరాన్ని రక్షించుకోవాలంటే కార్పొరేషన్ ఎన్నికల్లో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని వైయస్ఆర్ సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి గారు కోరారు. మంగళవారం నగరంలోని 27, 28, 29, 49, 50 డివిజన్లలో మేయర్ అభ్యర్థితో రమేష్‌గౌడ్ గారితో కలిసి ఆయా డివిజన్ల కార్పొరేటర్ అభ్యర్థులు సులోచన, కృష్ణనవ్య, భారతి, ఆరీఫా, లక్ష్మిదేవి (సీపీఐ) తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు
ఈ సందర్భంగా అనంత గారు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి కూటమి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు. ఈ ఎన్నికల్లో పోలీసులను గుప్పెట్లో పెట్టుకుని గెలవాలన్న ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. కూటమి నేతలకు ఓటమి భయం పట్టుకుందని చెప్పారు. అనంతపురం నగర పాలక సంస్థ పరిధిలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిపించుకుని భారీ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో తాము ఇంటింటికీ వెళ్తుంటే వైయస్ జగన్ పాలనకు, చంద్రబాబు పాలనకు మధ్య తేడాను ప్రజలే బేరీజు వేస్తున్నారని తెలిపారు. రెండున్నరేళ్లలో ఇక్కడి ఎమ్మెల్యే, అనుచరులు ఎలా దోపిడీ చేశారో ప్రజలే చర్చించుకుంటున్నారని చెప్పారు. ప్రజాసేవ కోసం కాదు..ఈ అనంతపురం నగరాన్ని దోచుకునేందుకే వాళ్లు ఎమ్మెల్యే అయ్యారు అంటూ ఓటర్లే తమతో చెబుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. గతంలో వైయస్ఆర్ సీపీ ఐదేళ్ల పాలనలో అనంతపురంలో ఎలాంటి అలజడులు లేవని, ప్రజలు ప్రశాంతంగా జీవనం సాగించారని తెలిపారు. కూటమి వచ్చాక రెండున్నరేళ్లలో భూకబ్జాలు, దందాలు, అరాచకాలు, డబుల్ రిజిస్ట్రేషన్లు పెరిగిపోయాయని తెలిపారు. అవినీతిపరుల నుంచి నగరాన్ని కాపాడుకోవాలంటే ఈ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థి రమేష్‌గౌడ్ గారితో పాటు వైయస్ఆర్ సీపీ కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తే తామంతా నగరానికి, ప్రజలకు కాపలాదారులుగా ఉంటామని.. కూటమి నేతల దౌర్జన్యాలను అడుగడుగునా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు ఓటు ద్వారా బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలకు బుద్ధి చెప్పాలని కోరారు.
బీజేపీ అభ్యర్థిని చిత్తుచిత్తుగా ఓడించండి: జగదీష్ గారు
అనంతపురం కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా బీజేపీ నుంచి పోటీ చేస్తున్న అజేష్ బాబును చిత్తుచిత్తుగా ఓడించాలని సీపీఐ సీనియర్ నేత జగదీష్ పిలుపునిచ్చారు. 49, 50 డివిజన్లలో ఆయన వైయస్ఆర్ సీపీ, సీపీఐ అభ్యర్థులకు మద్దతుగా అనంత వెంకటరామిరెడ్డి గారు, మేయర్ అభ్యర్థి రమేష్‌గౌడ్ గారితో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ మంత్రి సత్యకుమార్‌తో పాటు రాష్ట్ర నాయకులంతా వచ్చి అనంతపురం ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపుతున్నారని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ 12 ఏళ్లుగా అధికారంలో ఉందని, రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. గతంలో ఓట్ల కోసం ప్రతి వ్యక్తి అకౌంట్‌లో రూ.15 లక్షలు వేస్తామని మోదీ హామీ ఇచ్చినట్టే అనంతపురంలో బీజేపీ అలవికాని హామీలను ఇస్తోందని చురకలంటించారు. అనంతపురం కార్పొరేషన్‌లో వైయస్ఆర్ సీపీ, సీపీఐ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

