POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 30 October 2026, 11:50 am Posted by : POLITICAL POWER

అశ్వారావుపేటలో శివమాల ధారణ


అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట కోనేరు బజార్‌లోని పురాతన కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం సుమారు 30 మంది శివభక్తులు శివమాల ధారణ చేశారు. 41 రోజుల మండల దీక్ష అనంతరం మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ సమీపంలో ఉన్న 12వ జ్యోతిర్లింగ క్షేత్రమైన ఘృష్ణేశ్వర స్వామిని దర్శించుకుని ఇరుముడి సమర్పించనున్నారు. కాశీ, రామేశ్వరం జ్యోతిర్లింగ క్షేత్రాల్లో మొక్కులు ఉన్న కొందరు భక్తులు ఆయా క్షేత్రాల్లోనూ ఇరుముడి సమర్పించనున్నారు.

ఈ సందర్భంగా గురుస్వామి జల్లిపల్లి శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ, శివుని అనుగ్రహంతో తాను ఇప్పటివరకు 34 సార్లు శివమాల ధరించానని, అన్ని జ్యోతిర్లింగాలను దర్శించుకున్నానని తెలిపారు. ఈ ఏడాది మరోసారి భక్తులతో కలిసి ఘృష్ణేశ్వర స్వామి క్షేత్రానికి వెళ్లి ఇరుముడి సమర్పించనున్నట్లు పేర్కొన్నారు.

ఘుష్మ అనే భక్తురాలి భక్తికి మెచ్చి, ఆమె మరణించిన కుమారుడిని శివుడు తిరిగి బతికించడంతో ఘృష్ణేశ్వరుడిగా వెలిశాడని ఆయన వివరించారు. 41 రోజులపాటు భక్తిశ్రద్ధలతో శివమాల ధరించి, నిత్యం శివనామస్మరణ చేస్తే స్వామివారి కృప లభిస్తుందని, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు ఆలయంలో అభిషేకాలు, పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.