అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి
ఎన్డీపీఎస్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ అశ్వారావుపేట రిపోర్టర్ వడితే గణేష్ ఆగష్ట 22 2026: వార్షిక తనిఖీలలో భాగంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ అశ్వారావుపేట పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పాల్వంచ డీఎస్పీ ఆర్. సతీష్ కుమార్ జిల్లా ఎస్పీకి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది నుంచి జిల్లా ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించే సిబ్బంది ప్రభుత్వ కిట్ ఆర్టికల్స్ ను తనిఖీ చేశారు, పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి, అధికారులకు మరియు సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్‌ను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరిస్తూ, వారి సమస్యలకు సత్వర న్యాయం అందేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా విధులు నిర్వర్తించాలని తెలిపారు. పోలీస్ స్టేషన్‌లో వివిధ వర్టికల్స్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పనితీరును ఒక్కొక్కరిగా అడిగి తెలుసుకున్నారు. పేకాట, కోడిపందాలు, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై నిరంతరం నిఘా ఉంచి, కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన దొంగతనం కేసుల వివరాలను అడిగి తెలుసుకొని, పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించడంతో పాటు, దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను గుర్తించి అరెస్ట్ చేయాలని సూచించారు. చోరీకి గురైన ఆస్తి రికవరీపై ప్రత్యేక దృష్టి సారిస్తూ దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు. మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులను గుర్తించి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. సీసీటీఎన్ఎస్ 2.0లో కేసుల నమోదు, దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు సక్రమంగా అప్‌డేట్ చేయాలని, ఈ-సాక్ష్య, నాట్ గ్రిడ్, గాండీవ వంటి ఆధునిక సాంకేతిక వ్యవస్థలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా నిరంతరం సైబర్ అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాలతో నిరంతరం సంచరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, డయల్–112కు ఫోన్ రాగానే సంఘటనా స్థలానికి వేగంగా చేరుకుని బాధితులకు తక్షణ సహాయం అందించాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకుని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. పర్యావరణం పరిరక్షణలో భాగంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ డీఎస్పీ ఆర్. సతీష్ కుమార్, సీఐ నాగరాజు, ఎస్సైలు యయాతి రాజు, రాజేష్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.