POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 10 November 2026, 6:57 pm Posted by : POLITICAL POWER

అశ్వారావుపేట మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.48.72 కోట్ల ప్రతిపాదనలు!

పట్టణంలోని 22 వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి భారీ నిధుల ప్రతిపాదన

మంత్రి వాకిటి శ్రీహరికి అభివృద్ధి పనుల ప్రతిపాదనలు అందజేసిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

పొలిటికల్ పవర్, అశ్వారావుపేట ఆర్సి ఇంచార్జ్ ఎం. నాగార్జున:అశ్వారావుపేట పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.48.72 కోట్ల నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వాకిటి శ్రీహరికి అందజేశారు.

ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రామసహాయం రఘురామ్ రెడ్డి, ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మువ్వా విజయబాబు, అశ్వారావుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్‌లతో కలిసి ఎమ్మెల్యే మంత్రిని కలిసి పట్టణ అభివృద్ధికి అవసరమైన నిధులపై వివరించారు.

ఈ ప్రతిపాదనల్లో భాగంగా పట్టణంలోని 22 వార్డుల్లో సీసీ రోడ్లు, సీసీ డ్రెయిన్ల నిర్మాణానికి రూ.35.52 కోట్లు, భగత్‌సింగ్ సెంటర్ నుంచి అంబేడ్కర్ నగర్ వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా వర్షపు నీటి కాలువల నిర్మాణానికి రూ.5.87 కోట్లు, నాలుగు వార్డుల్లో ప్రధాన డ్రెయిన్ల నిర్మాణానికి రూ.4.33 కోట్లు కేటాయించాలని కోరారు.

అలాగే పట్టణ పారిశుధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు జేసీబీ, డోజర్, ట్రాక్టర్లు, స్వచ్ఛ ఆటోల కొనుగోలుకు రూ.2 కోట్లు, ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటుకు రూ.25 లక్షలు, మంచినీటి పైప్‌లైన్ల నిర్మాణానికి రూ.50 లక్షలు, సబ్‌మెర్సిబుల్ మోటార్లు, పంపుసెట్ల ఏర్పాటుకు రూ.25 లక్షలు మంజూరు చేయాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు.

ఈ నిధులు మంజూరైతే అశ్వారావుపేట పట్టణంలో రహదారులు, డ్రెయినేజీ, పారిశుధ్యం, వీధి దీపాలు, తాగునీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. పట్టణ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు ప్రాధాన్యతనిస్తూ ఎమ్మెల్యే సమర్పించిన ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేయాలని పట్టణ ప్రజలు ఆశిస్తున్నారు.