POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 8:04 pm Posted by : POLITICAL POWER

అస్తవ్యస్త విద్యుత్ సరఫరాతో రైతులు ఆగం

 

వెల్టూర్ సబ్‌స్టేషన్ ఎదుట మాజీ జడ్పీటీసీ రఘుపతిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నాపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 16 2026: పెద్దమందడి అస్తవ్యస్తంగా కొనసాగుతున్న విద్యుత్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్‌ఎస్ మాజీ జడ్పీటీసీ రఘుపతిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ కోతలను నిరసిస్తూ బుధవారం వెల్టూర్ సబ్‌స్టేషన్ ఎదుట రైతులతో కలిసి ఆయన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రఘుపతిరెడ్డి మాట్లాడుతూ… గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా జరిగేదని, ప్రస్తుతం ఇందిరమ్మ పాలనలో విద్యుత్ సరఫరాకు వేళాపాళా లేకుండా కోతలు విధిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం రోజుకు 12 గంటల విద్యుత్ అందిస్తున్నామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో రైతులకు కేవలం 7–8 గంటల మేర మాత్రమే విద్యుత్ అందుతోందని అన్నారు. సమయ సందర్భం లేకుండా విద్యుత్ కోతలు విధించడంతో పంటలకు నీరందించేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యుత్ కోతలపై రాష్ట్రంలోని పలుచోట్ల రైతులు సబ్‌స్టేషన్లను ముట్టడిస్తూ నిరసనలు చేపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని, కనీసం వ్యవసాయ అవసరాలకు అవసరమైన విద్యుత్‌ను నిర్దిష్ట సమయాల్లో అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారని రఘుపతిరెడ్డి తెలిపారు. రైతులు కోరుతున్న 24 గంటల విద్యుత్ సరఫరా అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో రైతులతో పాటు బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొని విద్యుత్ కోతలపై నిరసన వ్యక్తం చేశారు.