POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 9:15 am Posted by : POLITICAL POWER

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కి నూతన రధసారధి పి వి మోహన్

ఏపీ కాంగ్రెస్‌కు కొత్త రథసారథి పి.వి. మోహన్!

​తమ ఓటు బ్యాంకు కోసమా? జగన్‌తో సమన్వయం కోసమా?

​ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే రాజకీయ సమీకరణాలను తిరగరాసేందుకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ వ్యూహాత్మక అడుగు వేసింది. ఢిల్లీ పీఠం నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ జారీ చేసిన నూతన సంస్థాగత ఉత్తర్వులు ఏపీ కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపాయి. తమిళనాడు బాధ్యతలకు మాణికం ఠాకూర్‌ను పంపి, ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ పీఠంపై సీనియర్ వ్యూహకర్త, కర్ణాటకకు చెందిన పి.వి. మోహన్‌ను అధిష్ఠానం నియమించింది.

​ఇది కేవలం ఒక సాధారణ మార్పు కాదు—ఏపీలో హస్తం గుర్తును పునర్నిర్మించేందుకు వేసిన బలమైన వ్యూహాత్మక అడుగు.

​ఏపీ కాంగ్రెస్ ఆశల వెలుగు: పీవీ మోహన్ ట్రాక్ రికార్డ్

​కర్ణాటక రాజకీయాల నుంచి వచ్చి ఏఐసీసీ స్థాయిలో కీలక పాత్ర పోషిస్తున్న పి.వి. మోహన్, క్షేత్రస్థాయి పోరాటాలకు, సంస్థాగత నిర్మాణానికి మారుపేరు. ఏఐసీసీ పరిశీలకుడిగా, కార్యదర్శిగా వివిధ రాష్ట్రాల్లో ఆయన సాధించిన విజయాలు ఏపీ కాంగ్రెస్‌కు కొండంత బలాన్ని ఇస్తున్నాయి.

​దక్షిణాది సమన్వయంలో దిట్ట: కేరళ, లక్షద్వీప్ వంటి చోట్ల ఏఐసీసీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన సమయంలో, అంతర్గత విభేదాలను సరిదిద్ది పార్టీ యంత్రాంగాన్ని ఒకే తాటిపైకి తెచ్చిన ఘనత మోహన్‌ది.

​తెలంగాణ సంస్థాగత నిర్మాణంలో కీలక పాత్ర: ఇటీవల తెలంగాణలో రంగారెడ్డి, వికారాబాద్ డీసీసీల ఎంపికలో ఏఐసీసీ పరిశీలకుడిగా వ్యవహరించి, సరైన ప్రజాదరణ ఉన్న నాయకులను గుర్తించి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అవసరమైన గ్రౌండ్ వర్క్ చేశారు.

​క్షేత్రస్థాయి కేడర్‌తో నేరుగా అనుసంధానం: ఎన్‌ఎస్‌యూఐ (NSUI) విద్యార్థి విభాగం నుంచి ఎదిగిన నాయకుడు కావడం వల్ల, కార్యకర్తల కష్టాలు, పోరాటాలు ఆయనకు క్షుణ్ణంగా తెలుసు.

​ఆంధ్రప్రదేశ్‌లో సవాళ్లు – మోహన్ మార్క్ వ్యూహం

​పక్కనే ఉన్న తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ సంపూర్ణ అధికారంలో ఉండగా, తమిళనాడులో భాగస్వామిగా ఉనికి చాటుకుంటోంది. జగన్ విఫలమైన వేళ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక బలమైన ప్రత్యామ్నాయ ప్రతిపక్షం కోసం చూస్తున్నారు.

​ఆ విషయం తెలిసిన జగన్ మోహన్, ఇటీవలే కాక్రోచ్ పార్టీ అలజడి చూసి బీజేపీని తక్కువ అంచనా వేసి కేసీ వేణుగోపాల్‌ను రహస్యంగా కలిశారనే సమాచారం బీజేపీ అధిష్టానానికి ఉప్పందింది. “మేము కూడా ఆంధ్రాలో కాక్రోచ్” అని జగన్ బహిరంగంగా ప్రకటించడం కమలనాథులకు పుండు మీద కారం చల్లినట్లయింది. అయితే, ఆ తర్వాత బీజేపీ చేపట్టిన దిద్దుపాటు చర్యలతో కాక్రోచ్ అలజడి సద్దుమణగడంతో, జగన్ పెద్ద తప్పిదం చేశారని వైకాపాలోని కీలక నాయకులు భావిస్తున్నారు. అదే సమయంలో విజయసాయిరెడ్డి మరోసారి కాంగ్రెస్ పార్టీకి జగన్ మద్దతు ఇస్తాడని ప్రకటించడం కలకలం సృష్టించింది. పైగా తాను సెపరేట్ పార్టీ పెడుతున్నట్లు సాయిరెడ్డి ప్రకటించారు.

​జగన్ ప్రపోజల్ విషయంలో కాంగ్రెస్ ఏ నిర్ణయం తీసుకుందో బయటకు తెలియడం లేదు. కానీ, స్థానిక పీసీసీ నాయకత్వంతో కలిసి గ్రామ స్థాయి నుంచి బూత్ కమిటీలను బలోపేతం చేయడమే మోహన్ ప్రథమ కర్తవ్యమని అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం.

​”అధికార కూటమి, గత వైకాపా వైఫల్యాలను ఎండగడుతూ, కాంగ్రెస్ సాధించిన సంక్షేమ, అభివృద్ధి నమూనాను ఏపీ ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పి.వి. మోహన్ రాక ఉండబోతోంది” అని ఆంధ్రాలోని కాంగ్రెస్ శ్రేణులు అంచనా వేస్తున్నాయి.

​కర్ణాటక, తెలంగాణ మోడల్‌తో ఏపీలో కాంగ్రెస్ సొంత కాళ్లపై నిలబడుతుందా? లేక రాబోయే సార్వత్రిక సమీకరణాల కోసం జగన్‌తో సయోధ్య బాట పడుతుందా అనేది పి.వి. మోహన్ వేసే అడుగులతో తేలిపోనుంది.