పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్రప్రదేశ్, జూలై 31: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 1 నుంచి 9 వరకు ప్రతి ఆదివాసీ గూడెంలో ‘నవోత్సవాలు’ ఘనంగా నిర్వహించి విజయవంతం చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ (ఏఎస్పీ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను పిలుపునిచ్చారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ… ఆదివాసుల రాజ్యాంగ హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించడం, హక్కుల సాధనకు ఐక్య ఉద్యమాలను బలోపేతం చేయడం లక్ష్యంగా గత 11 సంవత్సరాలుగా ఆగస్టు 1 నుంచి 9 వరకు ‘నవోత్సవాలు’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ప్రాముఖ్యతతో పాటు ఆదివాసుల అస్తిత్వం, సంస్కృతి, జీవన విధాన పరిరక్షణపై గ్రామీణ స్థాయిలో ప్రజలకు చైతన్యం కల్పించడం ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ఐక్యరాజ్యసమితి “ఆదివాసీ మంత్రసానులు/సాంప్రదాయ వైద్యులను గౌరవించడం: జీవనం మరియు శ్రేయస్సుకు రక్షణ” అనే అంశాన్ని ఎంపిక చేసిందని ఆయన తెలిపారు. తరతరాలుగా సాంప్రదాయ వైద్యం అందిస్తూ, గర్భిణులు, బాలింతలకు సేవలందిస్తున్న ఆదివాసీ మంత్రసానుల సేవలను గుర్తించి గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఆదివాసీ గూడెంలో ఆదివాసీ జెండాను ఎగురవేసి నవోత్సవాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని కుంజా శ్రీను పిలుపునిచ్చారు. చట్టాల పరిరక్షణ, హక్కుల సాధనతో పాటు విద్య, ఉద్యోగాలు, రాజకీయ రంగాల్లో ఆదివాసీలు మరింత ముందుకు సాగేలా ఈ తొమ్మిది రోజులపాటు అవగాహన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. నవోత్సవాల విజయవంతానికి ఆదివాసీ నాయకులు, యువత, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.