జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు
దమ్మపేట / పొలిటికల్ పవర్, సెప్టెంబర్16:దగాపడ్డ నేల విముక్తి కోసం, వెట్టిచాకిరీ సంకెళ్లు తెంచేందుకు ‘భూమి కోసం.. భుక్తి కోసం’ ఉవ్వెత్తున ఎగిసిపడిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ప్రపంచ విప్లవ చరిత్రలోనే ఓ అరుదైన ఘట్టం. నిజాం నవాబుల నిరంకుశత్వం, దేశ్‌ముఖ్‌ల అణచివేత, రజాకార్ల నెత్తుటి దాహానికి వ్యతిరేకంగా పల్లెపల్లెనా జనం ఆయుధాలు చేతబట్టి గర్జించారు.
ప్రముఖుల పోరాటాలే కాక, మారుమూల గిరిజన గూడేల నుంచి ప్రాణాలర్పించిన పోరాట యోధుల త్యాగాలు కూడా ఈ గడ్డను పునీతం చేశాయి. అలాంటి చారిత్రక వీరుల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం జమేదార్ బంజర గ్రామానికి చెందిన గిరిజన యోధుడు, ‘ఆదివాసి బెబ్బులి’ అమరుడు సోయం గంగులు ఒకరు అని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా అన్నారు.
వేలేరుపాడు నుంచి విప్లవ బాట...
ఒక సాధారణ ఆదివాసీ కుటుంబంలో జన్మించిన సోయం గంగులు, యవ్వనంలో వేలేరుపాడు మండలం పేరంటాలపల్లి ప్రాంతంలో ఉంటూ ప్రజల సమస్యలపై చైతన్యం తెచ్చారు. గిరిజనులపై భూస్వాములు, పెత్తందార్లు సాగిస్తున్న వెట్టి, దౌర్జన్యాలను సహించలేక పోరాట బాట పట్టారు.
1948 మార్చిలో పాల్వంచ ప్రాంత కమ్యూనిస్టు దళంలో చేరిన ఆయన, అనతికాలంలోనే పాల్వంచ అటవీ ప్రాంతాన్ని కమ్యూనిస్టులకు తిరుగులేని విప్లవ స్థావరంగా మార్చడంలో కీలక భూమిక పోషించారు. అటవీ సంపదపై ఆదివాసీల హక్కుల కోసం నడుంకట్టి, గెరిల్లా పోరాటానికి బాటలు వేశారు.
నల్లమల గిరిప్రసాద్ దళంలో కీలక పాత్ర...
తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టు దిగ్గజం నల్లమల గిరిప్రసాద్ నాయకత్వంలోని గెరిల్లా దళంలో సోయం గంగులు అత్యంత కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
గిరిప్రసాద్ వ్యూహరచనలకు అనుగుణంగా మన్యం అటవీ మార్గాల్లో గంగులు దళాలను సమర్థవంతంగా నడిపిస్తూ రజాకార్ల దాడులను తిప్పికొట్టారు. అటవీ ప్రాంత భౌగోళిక పరిస్థితులపై గంగులుకున్న పట్టు గిరిప్రసాద్ దళానికి కొండంత రక్షణ కవచంలా నిలిచింది. రజాకార్లు, నిజాం సైన్యాల కదలికలను ముందే పసిగట్టి గెరిల్లా దాడులతో శత్రువుల గుండెల్లో సింహస్వప్నమయ్యారు. భూస్వాముల గడీలపై దాడులు చేసి పేదలకు ధాన్యం పంచడంలో, పార్టీ క్రమశిక్షణతో కూడిన పోరాటాన్ని నడపడంలో ముందుపీఠిన నిలిచారు.
కోవర్టు కుట్రతో అమరుడు...
సోయం గంగులును మట్టుబెడితే తప్ప ఉద్యమాన్ని అణచలేమని భావించిన భూస్వాములు, పెత్తందార్లు ఆయన సమీప బంధువునే కోవర్టుగా మార్చి కుట్ర పన్నారు. జీలుగుమిల్లి అటవీ ప్రాంతంలో స్పృహ కోల్పోయిన స్థితిలో ఉన్న గంగులును బంధించి చిత్రహింసలకు గురిచేశారు.
ప్రాణాలు పోతున్న క్షణాల్లోనూ పార్టీ రహస్యాలను వెల్లడించకుండా నిలిచిన ఆ వీరుడిని, 1951 మే 12న సత్తుపల్లి ప్రాంతంలోని రుద్రాక్షపల్లి వద్ద రావిచెట్టుకు కట్టేసి తుపాకీలతో కాల్చి చంపారు.
ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి అమరత్వం పొందిన ఆ వీరుడి జ్ఞాపకార్థం జమేదార్ బంజరలో నేటికీ సగర్వంగా నిలిచివున్న స్మారక స్తూపం నాటి పోరాట ధీరత్వాన్ని గుర్తుచేస్తోంది.
సెప్టెంబర్ 17 సందర్భంగా స్మరించుకుందాం...
సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినోత్సవం మరియు సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా, మరుగునపడిన ఇలాంటి వీరుల త్యాగాలను స్మరించుకోవడం మనందరి చారిత్రక బాధ్యత. సోయం గంగులు అంటే కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు.. పీడనపై ఆదివాసీ బిడ్డలు ఎక్కుపెట్టిన విప్లవ బాణం. భద్రాద్రి జిల్లా సాయుధ పోరాట ‘కోయ బెబ్బులి’గా ఆయన చేసిన త్యాగం, రాజీలేని పోరాట స్ఫూర్తి తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచివుంటాయని సాబీర్ పాషా పేర్కొన్నారు.