POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 5:14 pm Posted by : POLITICAL POWER

ఆనంద నిలయం.. కొండలయ్య క్షేత్రం!

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 05 2026: పెద్దమందడి కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతున్న పెద్దమందడి మండలం జగత్ పల్లి కొండలయ్య గుట్టపై స్వయంభుగా వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం శనివారం ఆనంద నిలయంగా మారింది. శ్రావణ మాసపు చివరి శనివారం సందర్భంగా భక్తుల గోవింద నామస్మరణతో కొండలయ్య గుట్ట దద్దరిల్లింది. జగత్ పల్లి గ్రామస్తులతో పాటు వనపర్తి మండలంలోని రాజనగరం, నాగవరం, రాజపేట, వనపర్తి పట్టణాల నుంచి వందలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నుండే భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది.

గోవింద నామస్మరణతో మార్మోగిన గుట్ట.

గుట్ట కింద కొలువైన అభయ ప్రదాత అభయాంజనేయ స్వామిని తొలుత దర్శించుకున్న భక్తులు, అనంతరం ఏడుకొండలవాడా.. వెంకటరమణా.. గోవిందా.. గోవిందా అంటూ భక్తి పారవశ్యంతో గుట్టపైకి బయలుదేరారు. గోవింద నామాన్ని జపిస్తూ కొండ ఎక్కే ఆయాసాన్ని సైతం మరిచి, స్వామి దివ్య మంగళ రూప దర్శనంతో పులకించిపోయారు. భక్తుల కోలాహలంతో ఆలయ ప్రాంగణం ఒక్కసారిగా చిన్న తిరుమలను తలపించింది. శ్రావణ శనివారం నాడు తిరుమలేశుడిని దర్శించుకుంటే సప్త జన్మల పాపాలు తొలగి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, సహస్రనామార్చనలు నిర్వహించారు.

అన్నదానంతో పునీతం.అనంతరం జగత్ పల్లి గ్రామానికి చెందిన దాత గట్టు నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం భక్తిభావంతో సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించి ఆనంద పరవశం చెందారు. అన్నదానం మహాదానం అన్నట్టుగా, ఆకలి తీర్చిన దాతకు భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెంటన్న యాదవ్, మాజీ సర్పంచులు మోహన్ కుమార్ యాదవ్, నిరంజన్ గౌడ్, నారాయణ యాదవ్, గ్రామ ప్రముఖులు బూరుగుపల్లి శ్రీనివాసరెడ్డి, జి. శ్రీనివాస యాదవ్, వార్డ్ మెంబర్ మోజర్ల రాములు, కుమార్ యాదవ్, దత్తాత్రేయ రెడ్డి, కృష్ణ సాగర్, సురేష్ చారి, బుచ్చన్న నాయుడు, వెంకటేష్ నాయుడు, తుప్పుడ భాస్కర్ యాదవ్, తిరుపతి నాయుడు, కృష్ణుడు, చంద్రుడు తదితరులు పాల్గొన్నారు.