POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 11 November 2026, 8:54 pm Posted by : POLITICAL POWER

ఆపదలో ఆపన్నహస్తం.. ప్రాణరక్షణ సేవలకు ప్రశంసాపత్రం!

దమ్మపేట ఫైర్ ఫైటర్ తోట చెన్నారావుకు ఉన్నతాధికారుల అరుదైన గుర్తింపు

పొలిటికల్ పవర్,దమ్మపేట: ఆపద సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణాలను కాపాడిన దమ్మపేటకు చెందిన ఫైర్ ఫైటర్ తోట చెన్నారావుకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభించాయి. సత్తుపల్లి మండలం బేతపల్లి చెరువు వద్ద జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా రక్షించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

ప్రమాద సమయంలో ధైర్యసాహసాలతో పాటు సమయస్ఫూర్తిని ప్రదర్శించి బాధితుల ప్రాణాలను కాపాడేందుకు చేసిన విశేష కృషిని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఫైర్ సర్వీస్ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్, ఐపీఎస్ చేతుల మీదుగా తోట చెన్నారావు ప్రశంసాపత్రం (అప్రిసియేషన్ సర్టిఫికెట్) అందుకున్నారు.

విధి నిర్వహణలో అంకితభావం, ఆపదలో ఉన్నవారిని రక్షించాలనే సేవా తత్పరతకు ఈ ప్రశంసాపత్రం గుర్తింపుగా నిలిచింది. దమ్మపేటకు చెందిన చెన్నారావుకు ఉన్నతాధికారుల నుంచి ఈ గౌరవం లభించడంతో స్థానికులు, పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు.