1000 రోజుల కాంగ్రెస్ పాలనలో సాధించింది అక్రమ అరెస్టులేనా?
హైదరాబాద్ ధర్నాకు వెళ్తున్న ఆశాల అరెస్టుకు నిరసన..
దమ్మపేట తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 8: తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్ లో ధర్నాకు వెళ్తున్న ఆశా వర్కర్లను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో సాధించింది అక్రమ అరెస్టులేనా అని ప్రశ్నించారు. ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులను నిరసిస్తూ మంగళవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహశీల్దార్ కు అందజేశారు.
ఈ సందర్భంగా పిట్టల అర్జున్ మాట్లాడుతూ, ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.18,000 ఇస్తామని హామీ ఇచ్చిందని, ఇచ్చిన హామీని నెరవేర్చాలని అడగడం రేవంత్ రెడ్డి పాలనలో నేరమైందని ఎద్దేవా చేశారు.
ఆశా వర్కర్లకు సంబంధించి ఆరు నెలల పిఆర్సి ఏరియర్స్ పెండింగ్ లో ఉన్నాయని, లెప్రసీ సర్వే, పల్స్ పోలియో, ఎలక్షన్ డ్యూటీ తదితర బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎఎంసి, పిఎంసి టార్గెట్స్ ను రద్దు చేయాలని, 50 లక్షల ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యం కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ మురహరి రఘు, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సభ్యురాలు సునీత, రజిని, సంధ్య, నాగమణి, వరదరాణి, సుజాత, రాధ, బాబురావు తదితరులు పాల్గొన్నారు.
—
