వనపర్తి కలెక్టరేట్ ఎదుట టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 27 2026: వనపర్తి తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ కమిటీ (టీజీఈజేఏసీ) రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప్రధాన డిమాండ్ల పరిష్కారం కోసం వనపర్తి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ధర్నాను విజయవంతం చేశారు. ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ మహాధర్నా చేపట్టారు. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న ఆరు కరువు భత్యాలను (డీఏ) వెంటనే ప్రకటించాలని, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ ఆర్థిక ప్రయోజనాలను తక్షణమే చెల్లించాలని ఉద్యోగ సంఘాల నాయకులు కోరారు. అదేవిధంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు ప్రకటించిన ఆరోగ్య కార్డుల్లోని లోపాలను సవరించి ఆరోగ్య పథకాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా టీజీఈజేఏసీ అధ్యక్షులు అశోక్‌కుమార్ మాట్లాడుతూ… ఉద్యోగులు, ఉపాధ్యాయుల న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కోరారు. ఉద్యోగుల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకోవాలని ఆయన అన్నారు. టీజీఈజేఏసీ సెక్రటరీ జనరల్ ఎస్. వరప్రసాద్‌రావు మాట్లాడుతూ ఉద్యోగులకు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను మాత్రమే అమలు చేయాలని కోరుతున్నామని తెలిపారు. మేనిఫెస్టోలో పేర్కొన్న ఉద్యోగుల ప్రయోజనాలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
కలెక్టర్‌కు వినతిపత్రం
మహాధర్నా అనంతరం టీజీఈజేఏసీ జిల్లా నాయకులు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ని కలిసి ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. పెండింగ్ డీఏలు, పదవీ విరమణ ప్రయోజనాలు, పెన్షన్ విధానం, ఆరోగ్య కార్డులకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని వారు కోరారు.
ధర్నా శిబిరానికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాధర్నా శిబిరాన్ని సందర్శించారు. ఉద్యోగుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే.. వారి న్యాయమైన డిమాండ్లను అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే హామీపై టీజీఈజేఏసీ నాయకులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీజీఈజేఏసీ నాయకులు జి.సి. రాజు, బౌద్ధారెడ్డి, రవి ప్రసాద్‌గౌడ్, నరసింహులు, నాగేశ్వర్‌రెడ్డి, మహేష్‌కుమార్, గణేష్‌కుమార్, ప్రభాకర్, నరసింహ, నరసింహులుగౌడ్, రవీందర్‌రెడ్డి, వేణుగోపాల్, జ్యోతి, చెన్నమ్మ, ఎం. సురేష్, మద్దిలేటి, హరీష్‌కుమార్, ఎం. చంద్రశేఖర్, డి. కృష్ణయ్య, గోపాల్‌నాయక్, రామన్‌గౌడ్, రాజారామ్ ప్రకాష్, సురేష్, బాలేమియా, నరసింహ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో కలెక్టరేట్ పరిసరాల్లో మహాధర్నా ఉత్సాహంగా కొనసాగింది. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని టీజీఈజేఏసీ నాయకులు స్పష్టం చేశారు.