POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 4:26 pm Posted by : POLITICAL POWER

ఉద్యోగుల సమస్యలపై నల్ల బ్యాడ్జీలతో నిరసన

సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి.. ఆరు డీఏలు వెంటనే విడుదల చేయాలి

పీఆర్సీ అమలుతో పాటు విశ్రాంత ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి: టీజీఈజేఏసీ డిమాండ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 1 2026: తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి (టీజీఈజేఏసీ) రాష్ట్ర శాఖ పిలుపు మేరకు వనపర్తి జిల్లా టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయాల సముదాయంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలు చేయాలని కోరారు. అలాగే పెండింగ్‌లో ఉన్న ఆరు కరువు భత్యాలను (డీఏలు) వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. విశ్రాంత ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆర్థికపరమైన బకాయిలను కూడా ఆలస్యం చేయకుండా వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా టీజీఈజేఏసీ అధ్యక్షులు అశోక్ కుమార్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అమలు చేసే బాధ్యత ఉద్యోగులపై ఉందని, అలాంటి ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మొండి వైఖరి అవలంబించడం సరికాదన్నారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పెండింగ్ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. టీజీఈజేఏసీ సెక్రటరీ జనరల్ ఎస్. వరప్రసాద్ రావు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పట్ల ఉదాసీన వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించి ఉద్యోగులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమం అనంతరం ఉద్యోగుల సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అడిషనల్ కలెక్టర్ వినోద్ కుమార్ కు సమర్పించారు. ఈ నిరసన కార్యక్రమంలో టీజీఈజేఏసీ సభ్యులు జి.సి. రాజు, రవి ప్రసాద్ గౌడ్, మహేష్, హరి ప్రసాద్, నరసింహులు గౌడ్, వెంకటేష్, రామిరెడ్డి, సత్యనారాయణ, రామన్ గౌడ్, జగపతిరావు, సత్యనారాయణ, గిరీష్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఉద్యోగులకు టీజీఈజేఏసీ సంఘ బాధ్యులు కృతజ్ఞతలు తెలిపారు.