POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 30 October 2026, 4:48 pm Posted by : POLITICAL POWER

ఉపాధి హామీ పనులపై మేట్లకు శిక్షణ

నారాయణపురం రైతు వేదికలో VB-G RAM G పథకంపై అవగాహన కార్యక్రమం

పొలిటికల్ పవర్, నారాయణపురం, అక్టోబర్ 30: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామంలోని రైతు వేదికలో VB-G RAM G (వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్–గ్రామీణ) పథకంపై మేట్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని 15 గ్రామ పంచాయతీలకు చెందిన సుమారు 40 మంది మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ సిబ్బంది ఈ శిక్షణలో పాల్గొన్నారు.

ఎంపీడీవో కిషోర్, మండల ఏపీవో కె. రామచంద్రరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్లు కె. బాలకృష్ణ, వి. కామేశ్వరి, అస్మా, బి. మహేష్ శిక్షణ ఇచ్చారు. పథకం కింద చేపట్టే పనుల విధానం, పనులకు కొలతలు నిర్ణయించడం, ప్రస్తుతం చేపడుతున్న పనుల వివరాలు, కొలతల నమోదు తదితర అంశాలను వివరించారు.

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రైతు వేదికలో సైద్ధాంతిక శిక్షణ నిర్వహించగా, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అల్లం మహాలక్ష్మి ఫామ్‌పాండ్ వద్ద క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా పనుల గుర్తింపు, మార్కింగ్, కొలతలు నమోదు చేసే విధానంపై ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో నారాయణపురం సర్పంచ్ మడకం కుమారి ఆంధ్రయ్య, పంచాయతీ కార్యదర్శి క్రాంతి కుమార్, నరంవారిగూడెం కార్యదర్శి జగదీష్, వ్యవసాయ శాఖ ఏఈఓ రవీంద్ర, సొసైటీ సీఈఓ అరుణ, సండిపోగు రవి తదితరులు పాల్గొన్నారు.