POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 17 June 2026, 11:29 am Posted by : POLITICAL POWER

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యవసాయ రంగంలో గేమ్ చేంజర్‌గా బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ – తెలంగాణ స్టేట్ బ్యూరో సత్తుపల్లి, జూన్ 17: ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా, పౌల్ట్రీ రంగాల అభివృద్ధికి కీలకంగా మారనున్న బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ త్వరలో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. రైతుల ఉత్పత్తులకు విలువ ఆధారిత మార్కెట్ కల్పిస్తూ, యువతకు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు సృష్టించే ఈ ప్రాజెక్ట్ జిల్లాలో వ్యవసాయ రంగానికి గేమ్ చేంజర్‌గా నిలవనుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొంటున్నారు.

2016లో శంకుస్థాపన.. ఇప్పుడు వేగం

ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పీఎంకేఎస్‌వై (PMKSY) పథకం కింద సత్తుపల్లి మండలం బుగ్గపాడులో 60 ఎకరాల విస్తీర్ణంలో మెగా ఫుడ్ పార్క్‌కు 2016 ఫిబ్రవరి 5న ఆమోదం లభించింది. అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ప్రాజెక్ట్‌కు పునాదులు వేశారు. మొత్తం ప్రాజెక్ట్ వ్యయం రూ.109 కోట్లు కాగా, ఇందులో కేంద్ర ఆహార ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ నుంచి రూ.28 కోట్ల గ్రాంట్ లభించింది. రైతు ఉత్పత్తులకు విలువను జోడించి మార్కెట్ అవకాశాలను విస్తరించే లక్ష్యంతో కోర్ ప్రాసెసింగ్ సెంటర్ (CPC), ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్లు (PPC), కలెక్షన్ సెంటర్లు (CC) ఏర్పాటు చేయడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం.

కీలక మౌలిక వసతులు సిద్ధం

బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్‌లో ఒక సీపీసీ, రెండు పీపీసీల నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం 26 ఎకరాల పరిధిలో 26 పారిశ్రామిక ప్లాట్లు వివిధ సంస్థలకు కేటాయించారు. గోర్లాస్ గ్రీన్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇన్ఫినిటీ ఇండస్ట్రీస్ వంటి సంస్థలు ఇప్పటికే స్థలాలు పొందగా, తాజాగా దీపక్ నెక్స్ జెన్ ఆక్వా ప్రాజెక్ట్‌కు కూడా భూమి కేటాయించారు. రూ.615 కోట్ల పెట్టుబడితో ఏర్పడనున్న ఈ ఆక్వా ప్రాజెక్ట్ ద్వారా సుమారు 3,200 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

గత ప్రభుత్వంలో నిలిచిపోయిన ప్రాజెక్ట్

2016లో అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్ట్ దాదాపు తొమ్మిదేళ్ల పాటు పూర్తి స్థాయిలో ముందుకు సాగలేదు. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక దృష్టి సారించారు. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పలుమార్లు సమీక్షలు నిర్వహించి, అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసి ఫుడ్ పార్క్‌ను త్వరితగతిన ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

తుమ్మల దూరదృష్టికి నిదర్శనం

నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ రంగంలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా ఆయిల్ పామ్ సాగు విస్తరణకు కృషి చేసిన ఆయన, వ్యవసాయ ఉత్పత్తులకు విలువ ఆధారిత మార్కెట్ కల్పించే లక్ష్యంతో బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్‌కు రూపకల్పన చేశారు. సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటల సమృద్ధి ఉండటంతో పాటు 150 కిలోమీటర్ల పరిధిలో ఆక్వా, పౌల్ట్రీ రంగాల విస్తృత లభ్యతను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశారు.

వ్యూహాత్మక స్థానం – భారీ కనెక్టివిటీ

జాతీయ రహదారులు

NH-365B – 22 కి.మీ, NH-216 – 40 కి.మీ, NH-65 – 104 కి.మీ, నాగపూర్–విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి సమీపంలో

 రైల్వే కనెక్టివిటీ

కొత్తగూడెం రైల్వే స్టేషన్ – 49 కి.మీ, ఖమ్మం రైల్వే స్టేషన్ – 92 కి.మీ, కొండపల్లి రైల్వే లింక్ – 95 కి.మీ

విమానాశ్రయాలు

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం – 111 కి. మీ, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం – 299 కి.మీ

సముద్ర ఓడరేవులు

మచిలీపట్నం పోర్ట్ – 170 కి.మీ, కాకినాడ పోర్ట్ – 184 కి.మీ, విశాఖపట్నం పోర్ట్ – 325 కి.మీ, కృష్ణపట్నం పోర్ట్ – 420 కి.మీ

రైతాంగానికి వరం – ఉపాధికి కేంద్రం

రోడ్డు, రైల్వే, విమాన, సముద్ర మార్గాల అనుసంధానం కలిగిన వ్యూహాత్మక ప్రాంతంలో ఏర్పాటు అవుతున్న బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు పరిసర జిల్లాల రైతులకు కొత్త మార్కెట్లు, మెరుగైన ధరలు, విలువ ఆధారిత పరిశ్రమలు అందుబాటులోకి రానున్నాయి. అలాగే వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ తెలంగాణ వ్యవసాయ, ఆహార ప్రాసెసింగ్ రంగాల్లో విప్లవాత్మక మార్పులకు నాంది పలకనుందని రైతులు, ప్రజాప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ వేగంగా ముందుకు సాగుతుండటంపై రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది.