POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 1:18 pm Posted by : POLITICAL POWER

ఎండలో శ్రమిస్తున్నా అందని ప్రతిఫలం

ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంపై పంచాయతీ కార్మికుల తీవ్ర ఆందోళన

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిన్9 టీవీ తెలుగు న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెప్టెంబర్ 10 2026: జూలూరుపాడు మండల కేంద్రంలో గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దుతూ, పల్లె ప్రజల ఆరోగ్య రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ల (సఫాయి కార్మికుల) జీవితాలు నేడు తీవ్ర ఆందోళనలో కూరుకుపోయాయి. నిత్యం మండే ఎండలను సైతం లెక్కచేయకుండా క్షేత్రస్థాయిలో విధులను నిర్వర్తిస్తున్న ఈ కార్మికులకు, న్యాయంగా అందాల్సిన వేతనాలు సకాలంలో అందకపోవడం ప్రభుత్వ పాలకుల, అధికారుల వైఖరికి అద్దం పడుతోంది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాడు ప్రభుత్వ ఉద్యోగులతో పాటే గ్రామ పంచాయతీ కార్మికుల ఖాతాల్లోనూ ప్రతి నెలా ఒకటో తేదీకే నేరుగా వేతనాలు జమ చేస్తామని ఆర్భాటంగా హామీ ఇచ్చింది. కానీ, ఆ హామీలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి తప్ప ఆచరణలోకి రాలేదు. నెల గడిచి పది, పన్నెండు రోజులు గడుస్తున్నా జీతాలు రాకపోవడంతో, నిత్యం కష్టపడి పనిచేసే కుటుంబాలు అప్పులపాలు కావాల్సి వస్తోందని కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అధికారుల నిర్లక్ష్య వైఖరి

అడిగితేనే విదిల్చే దుస్థితి!

విధి నిర్వహణలో నిమిషం ఆలస్యమైతే కఠిన చర్యలు అంటూ హుకూం జారీ చేసే ఉన్నతాధికారులు, స్థానిక పాలకవర్గాలు. కార్మికులకు జీతాలు ఇచ్చే విషయంలో మాత్రం ఘోరమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. శ్రమను నమ్ముకుని బతుకుతున్న ఈ కార్మికులు స్వయంగా వెళ్లి తమ హక్కుల కోసం అధికారులను, ప్రతినిధులను అడగగా అడగగా వేతనాలు విదిల్చే దుస్థితి క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తోంది. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు తమ సొంత నిధుల నుంచి ఇస్తున్నట్లుగా వ్యవహరించడం వారి అహంకార వైఖరికి నిదర్శనం.ప్రభుత్వ పెద్దలు ప్రకటనలు గుప్పించడమే తప్ప, అవి క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయా లేదా అని పర్యవేక్షించడంలో పూర్తిగా విఫలమయ్యారు. అధికారులు, పాలకవర్గాల మధ్య సమన్వయ లోపం, నిధుల మళ్లింపుల కారణంగానే ఈ ఆలస్యం జరుగుతోందని స్పష్టమవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత ఉన్నతాధికారులు తమ మొద్దునిద్ర వీడి, హామీ ఇచ్చిన విధంగా ప్రతి నెలా ఒకటో తేదీనే కార్మికుల అకౌంట్లలో జీతాలు నేరుగా జమ అయ్యేలా తక్షణ చర్యలు చేపట్టాలని కార్మిక లోకం డిమాండ్ చేస్తోంది. లేనిపక్షంలో ఈ ఆందోళన మరింత ఉధృతం కాక తప్పదని హెచ్చరిస్తున్నారు.