
- *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*
రాష్ట్రంలో రానున్న శాసనమండలి (ఎమ్మెల్సీ) స్థానాల భర్తీకి సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ కసరత్తును తీవ్రం చేసింది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా పార్టీ ముఖ్య నేతలు వడపోత కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తదితరులు అభ్యర్థుల పరిశీలన బాధ్యతలను భుజానెత్తుకున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
ఖమ్మం జిల్లా వైపే కాంగ్రెస్ హైకమాండ్ చూపు:
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీసీ వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్ నేపథ్యంలో, ఈసారి ఎమ్మెల్సీ స్థానాన్ని ఖమ్మం జిల్లాకే కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా పరిధిలో బీసీ వర్గాల నుంచి బలమైన ప్రాతినిధ్యం లేకపోవడంతో, సామాజిక సమీకరణాలను సమతుల్యం చేయడానికి పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
సామాజిక సమీకరణాలే ప్రామాణికం:
ఖరారు చేయబోయే అభ్యర్థుల విషయంలో పార్టీ స్పష్టమైన మార్గదర్శకాలను అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా “ఒకరు బీసీ… మరొకరు రెడ్డి” అనే సామాజిక సూత్రం ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉండనుంది. కేవలం కుల సమీకరణాలే కాకుండా…
* అభ్యర్థుల సామాజిక న్యాయం పట్ల నిబద్ధత
* సుదీర్ఘ ఉద్యమ నేపథ్యం
* ఉన్నత విద్యార్హతలు
* ప్రజలతో ఉన్న సత్సంబంధాలు
వీటన్నింటినీ ప్రామాణికంగా తీసుకుని క్షేత్రస్థాయి నుంచి నివేదికలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ, ఖమ్మం జిల్లాకు చెందిన ఒక యువ బీసీ నేతకు ఈసారైనా మండలిలో అడుగుపెట్టే అవకాశం లభిస్తుందనే వార్త స్థానిక రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. త్వరలోనే దీనిపై పార్టీ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.