అదనపు డీఎంహెచ్‌వో డాక్టర్ ఎస్. రవిబాబు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9టీవీ తెలుగు న్యూస్ వైఎస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్ హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేసి, మొబిలైజేషన్ ఆఫ్ ఎయిడ్స్ సురక్ష (ఎంఏఎస్) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా అదనపు డీఎంహెచ్‌వో డాక్టర్ ఎస్. రవిబాబు హెచ్చరించారు. మంగళవారం “దిశ” ఆధ్వర్యంలో స్థానిక జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఐసీటీసీ కౌన్సిలర్లు, ఏఆర్‌టీ కేంద్రాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులతో నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతి ఆరోగ్య కేంద్రంలో హెచ్‌ఐవీ పరీక్షలు, కౌన్సెలింగ్, మందుల సరఫరా వంటి సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి జిల్లాల ఎయిడ్స్ నియంత్రణ క్లస్టర్ ప్రోగ్రామ్ అధికారి వేంపల్లి భాస్కర్ మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ముఖ్యంగా గర్భిణీలకు అవసరమైన హెచ్‌ఐవీ పరీక్షలు, చికిత్స, వైద్య సేవలను సకాలంలో అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. జిల్లాలోని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తే ఎయిడ్స్ వ్యాప్తిని సమర్థవంతంగా నియంత్రించవచ్చని పేర్కొన్నారు. సబ్‌సెంటర్లలో హెచ్‌ఐవీ స్క్రీనింగ్‌ను 95 శాతం లక్ష్యానికి చేరవేయడంతో పాటు, హెచ్‌ఐవీ బాధితుల్లో 95 శాతం మందికి చికిత్స అందించేందుకు కృషి చేయాలని సూచించారు. అలాగే వైరల్ లోడ్ నియంత్రణలో 99 శాతం లక్ష్యాన్ని సాధించేందుకు అధికారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో దిశా సూపర్వైజర్ ప్రసాద్, సీపీఓ ఆనంద్, ఐసీటీసీ కౌన్సిలర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రోగ్రామ్ మేనేజర్లు, ఎంఈఏలు, డీఎస్‌ఆర్‌సీ, ఐసీటీసీ సిబ్బంది పాల్గొన్నారు.