పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ – ఖమ్మం జిల్లా ప్రతినిధి జూన్ 18 2026: హైదరాబాద్‌లోని రాయదుర్గం పరిధిలో ఉన్న నాలెడ్జ్ సిటీలోని సర్వే నంబర్ 83/1లో గల భూముల వేలం వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గత నెల 28వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం టీజీఐఐసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ-వేలంలో ఒక్కో ఎకరం రూ.237 కోట్ల చొప్పున భూమిని విక్రయించిన విషయం తెలిసిందే. అయితే, వేలం వేసిన భూమిలో 5 ఎకరాలు తమకు చెందినవేనని పేర్కొంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. సదరు భూమిపై తమ హక్కులను పరిరక్షిస్తూ రిట్ ఆర్డర్ జారీ చేయాలని ఎస్‌బీఐ పిటిషన్‌లో కోరింది. పిటిషన్‌పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు, టీజీఐఐసీ నిర్వహించిన భూముల వేలం ప్రక్రియపై మూడు వారాల పాటు స్టే విధించింది. అలాగే ఈ వ్యవహారంలో తమ వాదనలు వినిపించాలని ఎస్‌బీఐ, టీజీఐఐసీ మరియు గౌర వెంచర్స్‌కు నోటీసులు జారీ చేస్తూ కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణలో భూమి యాజమాన్య హక్కులు, వేలం ప్రక్రియ చట్టబద్ధత వంటి అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.