POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 06 June 2026, 9:49 pm Posted by : POLITICAL POWER

ఏఐ, రోబోలు అన్నీ చేసుకుపోతే 2060 నాటికి మన పరిస్థితి ఏమిటి? అని మీమాంస మొదలైన వారికి నా సమాధానం

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజ రెడ్డి జూన్ 06 2026: హై స్కూల్ ల్లో చదువుతున్నప్పుడు మా ఊళ్ళో మొదటిసారి జేసీబీ వచ్చింది. అది చూసిన ముసలాళ్ళు అన్నారు. “ఒక్క జేసీబీ పది మంది చేసే పని చేస్తుందట. ఇక మనకు పని లేదు. అందరం చచ్చిపోవటమే.” నేను అప్పుడు రాష్ట్రం, దేశం, అంతర్జాతీయ పరిస్థితులు తెలుసుకోవాలని ప్రయత్నించేవాడిని. ఆ జేసీబీ భయం నాకూ వచ్చింది నిజానికి కానీ తర్వాత ఏమైంది?. ఆ జేసీబీ ని ఆపరేట్ చేయడానికి ఒకడు కావాలి. రిపేర్ చేయడానికి మరొకడు కావాలి.ఆయిల్ తేవడానికి ఇంకొకడు కావాలి. రోడ్డు డిజైన్ చేయడానికి ఇంజనీర్ కావాలి. రోడ్డు వేసిన తర్వాత దాని మీద వెహికల్స్ పెరిగాయి. వెహికల్స్ పెరిగితే పెట్రోల్ బంక్స్ వచ్చాయి. మెకానిక్స్ వచ్చారు. ధాబాస్ వచ్చాయి. ఒక జేసీబీ వచ్చి పది పనులు పోగొట్టి యాభై కొత్త పనులు తెచ్చింది. అదే తర్వాత కంప్యూటర్స్ విషయంలో జరిగింది. 1995 తర్వాత కంప్యూటర్స్ వచ్చాయి. టైపిస్ట్స్ అందరూ భయపడ్డారు. “ఇక మన ఉద్యోగాలు పోతాయి” అని నినాదాలు చేశారు. కానీ ఏమైంది? కంప్యూటర్ ఆపరేటర్ వచ్చాడు. హార్డ్ వేర్ ఇంజనీర్ వచ్చాడు. సాఫ్ట్వేర్ రాసే వాళ్ళు వచ్చారు. ప్రింటర్ రిపేర్ చేసే వాళ్ళు వచ్చారు. నెట్వర్క్ కనెక్షన్ ఇచ్చే వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత భారత్ ఐటీ రంగంలో ప్రపంచాన్ని శాసించే స్థాయికి వెళ్ళింది. టైపింగ్ పోయి కోడింగ్ వచ్చింది. ఇప్పుడు ఏ ఐ వచ్చింది. అదే భయం మళ్ళీ వచ్చింది. కానీ చరిత్ర ఒక పాఠం నేర్పింది — టెక్నాలజీ మారిన ప్రతిసారి పని రూపం మారింది. పని పోలేదు రిక్షా పోయింది. ఆటో వచ్చింది. ఆటో పోతే బైక్ టాక్సీ వచ్చింది. మీ దగ్గర స్కూటర్ ఉంటే సాయంత్రం 6 నుండి 10 గంటలు ఓలా , రాపిడో చేస్తే రోజుకు వెయ్యి రూపాయలు వస్తాయి. హాయిగా కుటుంబం పోషించవచ్చు. ఇది ఏ ఐ యుగంలో కొత్త పని ఇప్పుడు ఏ ఐ గురించి నిజం చెప్తాను. ఏ ఐ తెలివైనది. కానీ అది మనిషి కాదు. 99% సరైన సమాధానం ఇస్తుంది — కానీ 99% అంటే 100% కాదు. ఆ 1% తేడా కనిపెట్టడానికి మనిషి కావాలి. ఏ ఐ డేటా చూస్తుంది. కానీ డేటా వెనక మనిషి బాధ చూడలేదు. డాక్టర్ ఏ ఐ చెప్పిన రోగాన్ని డైగనోస్ చేస్తుంది — కానీ పేషెంట్ చేయి పట్టుకుని “బాగవుతావు” అని చెప్పడానికి మనిషి కావాలి

మరి 2060 నాటికి ఏమవుతుందంటే 

ఏఐ చేయలేనివి మనిషి చేస్తాడు. అవి ఏమిటంటే — సృజనాత్మకత, నిజమైన అనుభవం, మానవ సంబంధాలు, నైతిక నిర్ణయాలు. మెషిన్స్ ఇవి చేయలేవు. ఎందుకంటే ఇవి పుస్తకాల నుండి నేర్చుకున్నవి కాదు — జీవితం నుండి నేర్చుకున్నవి. భగవద్గీతలో కృష్ణుడు అన్నాడు. “న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే” — జ్ఞానంతో సమానమైన పవిత్రమైనది ఇంకొకటి లేదు అని. ఏ ఐ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. జ్ఞానం మనిషికి మాత్రమే వస్తుంది — అనుభవం ద్వారా వేమన అన్నాడు. “చదువు కొంచెమైన చాలును వివేక మదను వానికెల్ల నభ్యుదయము విశ్వదాభిరామ వినురవేమ” కొంచెం చదువు, వివేకం ఉంటే చాలు — అభ్యుదయం కలుగుతుంది. ఏ ఐ వాడుకోవడం నేర్చుకున్న వాడికి ఏ అయి శత్రువు కాదు — సహాయకుడు

ఇప్పుడు ఎకనామిక్స్ ఏమంటుందంటే

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2023 రిపోర్ట్ చెప్పింది— ఏ ఐ వల్ల 85 మిలియన్ ఉద్యోగాలు పోతాయి. కానీ అదే సమయంలో 97 మిలియన్ కొత్త ఉద్యోగాలు వస్తాయి. నెట్ గేయిన్ — 12 మిలియన్ జాబ్స్ . భయపడినంత కాదు. కానీ ఒక కండిషన్ ఉంది — ఆడప్ట్ చేసుకున్న వాడికి గేయిన్ ఆడప్ట్ చేసుకోని వాడికి పెయిన్ మానవ మెదడు ఏ కొత్త విషయాన్ని తొందరగా ఆక్సిప్ట్ చేయదు. అది జేసీబీ దగ్గర జరిగింది. కంప్యూటర్ దగ్గర జరిగింది. ఏ ఐ దగ్గర మళ్ళీ జరుగుతోంది. కానీ చరిత్ర చూసిన కంటికి భయం తక్కువగా ఉంటుంది

చివరగా ఒక్క మాట

భూమి మీద మనిషి పుట్టిన దగ్గర నుండి పనిచేస్తున్నాడు. పని రూపం మారింది — పని పోలేదు. పనిచేసే వాడికి ఎప్పుడూ పని ఉంటుంది. అది ఏ యుగంలో అయినా నిజమే, ఏ ఐ ని చూసి భయపడకండి. అది నేర్చుకోండి. వాడుకోండి. మీ పని కోసం పనికి పెట్టుకోండి. ఆ తెలివి ఉన్న వాడికి 2060 లో కూడా ఉద్యోగం ఉంటుంది — ఏ అయి ఉన్నా, రోబో ఉన్నా,ఇంకెమన్నా కొత్త టెక్నాలాజీ వచ్చినా అంతా మన మంచికే…