POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 25 September 2026, 7:03 pm Posted by : POLITICAL POWER

ఏడాది పోరాటం ఫలించింది.. ఎగమాలపాడుకు రూ.2.63 కోట్ల రోడ్డు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ సెప్టెంబర్ 25 2026: హుకుంపేట,:మారుమూల గిరిజన గ్రామమైన హుకుంపేట మండలం కొట్నపల్లి పంచాయతీ పరిధిలోని ఎగమాలపాడు గ్రామానికి ఎట్టకేలకు రహదారి సౌకర్యం కలగనుంది. గ్రామస్తులు సొంతంగా మట్టి, రాళ్లతో నిర్మించుకున్న సుమారు రెండు కిలోమీటర్ల దారి ఇప్పుడు రూ.263.50 లక్షల అంచనా వ్యయంతో తారు రోడ్డుగా అభివృద్ధి కానుంది. రోడ్డు కోసం గ్రామస్తులు, గిరిజన సంఘాల ప్రతినిధులు ఏడాది కాలంగా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. 2026 జనవరి 15న గ్రామాన్ని సందర్శించిన అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం విశాఖపట్నం జిల్లా కోశాధికారి సీసా శోభన్, ఉపాధ్యక్షుడు వంతాల ఆనందరావు రహదారి సమస్యను గుర్తించారు. బైక్‌లు, అంబులెన్స్‌లు కూడా వెళ్లలేని పరిస్థితిని అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. జనవరి 17న వంతాల ఆనందరావు కేంద్ర ప్రభుత్వ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో ఫిర్యాదు చేసి ఎగమాలపాడుకు ప్రధానమంత్రి గ్రామీణ రహదారుల పథకం కింద రహదారి మంజూరు చేయాలని కోరారు. దీనికి సంబంధించిన ఫిర్యాదును రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. స్థానిక మీడియా కూడా గ్రామ రహదారి సమస్యపై కథనాలు ప్రచురించింది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ వివరాల ప్రకారం ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, ప్రధానమంత్రి గ్రామీణ రహదారుల పథకం కింద మసాదా నుంచి గొండివలస మీదుగా ఎగమాలపాడు వరకు రహదారి పనులు మంజూరయ్యాయి. రహదారి ప్యాకేజీ సంఖ్య ఏపీ26పీవీటీ010. ప్రభుత్వం 2025 డిసెంబర్ 22న నిధులు మంజూరు చేయగా, 2025 డిసెంబర్ 29న సాంకేతిక అనుమతి లభించింది. అయితే రహదారి నిర్మాణ మార్గం అటవీ భూమి, అటవీ హక్కుల గుర్తింపు ప్రాంతం మీదుగా ఉండటంతో అటవీ అనుమతులు అవసరమయ్యాయి. సెప్టెంబర్ 2న జరిగిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో అనుమతులు లభించడంతో పనులు ప్రారంభించారు. సెప్టెంబర్ 8న పాడేరు పంచాయతీరాజ్ అమలు విభాగం కార్యనిర్వహణ ఇంజనీర్ ఎస్. రామకృష్ణ పనుల పురోగతిని ఉన్నతాధికారులకు నివేదించారు. ప్రస్తుతం అక్కడ మట్టి పనులు చురుకుగా జరుగుతున్నాయి. రోడ్డు మంజూరుపై వంతాల ఆనందరావు స్పందిస్తూ, మారుమూల గిరిజన ప్రాంతాల్లో రహదారి అభివృద్ధి ఎంతో అవసరమని, ఎగమాలపాడు ప్రజలకు ఇది చిరకాలంగా ఎదురుచూస్తున్న పరిష్కారమని అన్నారు. ఏళ్లుగా రోగులను నులక మంచాలపై మోసుకెళ్లాల్సిన పరిస్థితి నుంచి గ్రామస్తులకు ఈ రహదారి ఉపశమనం కలిగించనుంది.అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం విశాఖపట్నం జిల్లా కోశాధికారి సీసా శోభన్, ఉపాధ్యక్షుడు వంతాల ఆనందరావు రహదారి సమస్యను గుర్తించారు.