Date of Publish : 20 September 2026, 8:42 amPosted by : POLITICAL POWER
ఏల్నినో పేరుతో ఆంధ్రకు సాగునీరు తరలిస్తున్నారు
పాలమూరులో రైతులకు నీరు, కరెంట్ అందడం లేదు.. కేటీఆర్ ఆరోపణలుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 20 2026:పెబ్బేరు ఆంధ్రప్రదేశ్‌కు సాగునీరు తరలిస్తూ తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. వనపర్తి నియోజకవర్గంలోని పెబ్బేరు పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. పాలమూరు ప్రాంతంలో రైతులు సాగునీరు, విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ తెలిపారు. ప్రకృతి సమృద్ధిగా నీరు అందించినప్పటికీ రైతులకు సాగునీరు అందడం లేదని అన్నారు. రెండు విద్యుత్ సబ్‌స్టేషన్లను రైతులతో కలిసి సందర్శించామని, అక్కడ అధికారులు సరైన సమాధానం ఇవ్వలేకపోయారని పేర్కొన్నారు. రైతులకు ఆరు గంటలకు మించి విద్యుత్ సరఫరా కావడం లేదని, లో-వోల్టేజ్, తరచూ విద్యుత్ అంతరాయాలతో మోటార్లు కాలిపోతున్నాయని రైతులు తమ దృష్టికి తీసుకొచ్చారని కేటీఆర్ చెప్పారు. నీరు, విద్యుత్ అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని రైతులకు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పాలమూరు ప్రాంతంలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందించామని కేటీఆర్ తెలిపారు. ఏడు లక్షల ఎకరాలకు నీరు అందించామని, వరదల సమయంలో నీటిని మళ్లించి చెరువులు, చెక్‌డ్యామ్‌లు నింపేవారమని చెప్పారు. విద్యుత్ స్థాపిత సామర్థ్యాన్ని కూడా గణనీయంగా పెంచామని ఆయన పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు, వెలుగొండ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు నీరు వెళ్తున్నప్పటికీ తెలంగాణకు నీరు ఎందుకు రావడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. జూరాలకు ఎగువ నుంచి నీరు లేదని అధికారులు చెబుతున్నారని, మరోవైపు కల్వకుర్తి పంపులు సక్రమంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు స్పష్టమైన ప్రణాళిక అవసరమని కేటీఆర్ పేర్కొన్నారు. కర్ణాటకలో ఆలమట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచే ప్రతిపాదనలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో పాలమూరు ప్రాంతానికి నీటి లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటా సాధించే వరకు పోరాడతామని కేటీఆర్ అన్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం గతంలో జరిగిన అక్రమాలు, ప్రస్తుత నీటి విడుదలపై వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. రైతుల విద్యుత్, సాగునీటి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.