POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 11:52 am Posted by : POLITICAL POWER

ఒకే రోజు 5 ప్రసవాలు.. అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రి వైద్యుల ఘనత

4 సాధారణ ప్రసవాలు.. ఒక సిజేరియన్‌ విజయవంతం

తల్లులు, శిశువులు అందరూ క్షేమం

వైద్యులు, సిబ్బందిని అభినందించిన ఆసుపత్రి వర్గాలు

సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాధా రుక్మిణి వెల్లడి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ అశ్వారావుపేట రిపోర్టర్ వడితే గణేష్ సెప్టెంబర్ 06 2026: శ్వారావుపేట ఏరియా ఆసుపత్రి వైద్యులు మరోసారి తమ వైద్య నైపుణ్యాన్ని చాటుకున్నారు. ఒకే రోజులో ఐదుగురు గర్భిణులకు విజయవంతంగా ప్రసవాలు నిర్వహించి, తల్లులు–శిశువులందరూ క్షేమంగా ఉండేలా వైద్య సేవలు అందించారు. వీరిలో నాలుగు సాధారణ ప్రసవాలు కాగా, ఒక సిజేరియన్‌ ప్రసవం విజయవంతంగా నిర్వహించారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న ప్రసూతి సేవలను సద్వినియోగం చేసుకుంటున్న గర్భిణులకు వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది సమన్వయంతో మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లోనూ వైద్యులు సమయస్ఫూర్తితో స్పందిస్తూ తల్లులు, శిశువుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాధా రుక్మిణి తెలిపారు. ఒకే రోజులో ఐదుగురు మహిళలకు ప్రసవాలు విజయవంతంగా నిర్వహించడం ఆసుపత్రి వైద్య బృందం సమష్టి కృషికి నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రసవం పొందిన తల్లులు, శిశువులు అందరూ ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించారు.

వైద్య సేవల మెరుగుదలకు సహకారం

అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్‌ అంకిత్‌, డీసీహెచ్‌ఎస్‌ రవి బాబు అందిస్తున్న సహకారం ఎంతో కీలకమని డాక్టర్‌ రాధా రుక్మిణి తెలిపారు. వారి సహకారంతో ఆసుపత్రిలో ప్రజలకు మరింత సమర్థవంతమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

రోగుల్లో పెరుగుతున్న నమ్మకం

ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై రోగులు, వారి బంధువులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంతో పోలిస్తే వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది అందుబాటులో ఉండటంతో పాటు ప్రసూతి సేవలు కూడా మెరుగ్గా అందుతున్నాయని వారు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెంచే విధంగా వైద్యులు, సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పలువురు అభిప్రాయపడ్డారు.

వైద్య బృందం సమష్టి కృషి

ఈ విజయవంతమైన ప్రసవాల నిర్వహణలో ఆర్‌ఎంఓ, గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ మౌనిక, మత్తు వైద్య నిపుణులు, హెడ్‌ నర్సింగ్‌ ఆఫీసర్‌ వర్ధిని, నర్సింగ్‌ ఆఫీసర్లు ప్రమోలా రాణి, గణేష్‌, ఏఎన్‌ఎం స్వరూపరాణి తో పాటు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రి వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని, ఒకే రోజు ఐదు ప్రసవాలను విజయవంతంగా నిర్వహించడం అందుకు నిదర్శనమని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.