ఓటరు జాబితా ప్రత్యేక సవరణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి…!
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైయస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్ జులై 06 2026: భారత ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాల సభ్యులు చురుకుగా పాల్గొని ఓటరు జాబితాను మరింత ఖచ్చితంగా రూపొందించేందుకు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ఒక ప్రకటన ద్వారా కోరారు. ఇప్పటికే ఎన్యుమరేషన్ ఫారం (ఈఎఫ్) పూరించిన వారు ఆలస్యం చేయకుండా తమ ఆర్‌పీ/యానిమేటర్ ద్వారా లేదా నేరుగా బూత్ స్థాయి అధికారి (బీఎల్‌ఓ)కి అందజేయాలని సూచించారు. ఫారం సమర్పించని పక్షంలో డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో పేరు నమోదుకాకపోయే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇంకా ఫారం పూరించని వారు వెంటనే ఆర్‌పీ, యానిమేటర్ సహాయంతో పూర్తి చేసి బీఎల్‌ఓకు సమర్పించాలని సూచించారు. ఫారం పూరించేందుకు బీఎల్‌ఓ అందించిన ఈఎఫ్ ఫారం, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్ (ఐచ్ఛికం), అలాగే 2002లో కుటుంబ సభ్యులు ఓటరుగా నమోదై ఉంటే వారి వివరాలు అందుబాటులో ఉంచాలని తెలిపారు. 2002 నాటి ఓటరు వివరాలు తెలియకపోయినా, అప్పట్లో ఓటు వేసిన గ్రామం లేదా పట్టణం పేరు తెలిస్తే బీఎల్‌ఓ సహకారం అందిస్తారని పేర్కొన్నారు. ఫారంలో పుట్టిన తేదీ, తల్లిదండ్రుల వివరాలు, మొబైల్ నంబర్ వంటి వ్యక్తిగత వివరాలను పూర్తిగా నమోదు చేయాలని, ఓటరు లేదా కుటుంబంలోని వయోజన సభ్యుడి సంతకం లేదా బొటనవేలు ముద్ర తప్పనిసరిగా ఉండాలని, ఫోటో సక్రమంగా అతికించి పూర్తి చేసిన ఫారాన్ని బీఎల్‌ఓకు అందజేయాలని సూచించారు. ఇంకా ఓటరుగా నమోదు కాని అర్హులు అవసరమైన గుర్తింపు పత్రాలు, ఫోటోతో బీఎల్‌ఓను సంప్రదించి కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రతి అర్హత కలిగిన పౌరుడు ఈ కార్యక్రమంలో భాగస్వామి కావడం ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని, అందరూ బాధ్యతగా సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు…