POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 7:46 pm Posted by : POLITICAL POWER

కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు, కొరతలే

బీఆర్ఎస్ వైరా నేత అజ్మీరా వీరు నాయక్ యూరియా, డీఏపీ కొరతతో అన్నదాతల అవస్థలు

కేసీఆర్ హయాంలోనే రైతులకు రక్షణ అన్ని వర్గాలను వంచించిన ప్రస్తుత ప్రభుత్వంపై ధ్వజం

పొలిటికల్ పవర్ ప్రతినిధి జులై 29 2029:రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి కొరతలు, కష్టాలు నిత్యకృత్యమైపోయాయని, ఈ ప్రజావ్యతిరేక పాలన వల్ల అన్నదాతలు అపార నష్టాలు చవిచూస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ వైరా నియోజకవర్గ ముఖ్య నాయకులు అజ్మీరా వీరు నాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరా నియోజకవర్గ పరిధిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఘాటుగా విమర్శలు గుప్పించారు.

ఎరువుల కొరతతో రైతుల బతుకులు ఆగమ్యగోచరం:

ప్రస్తుతం సాగు సీజన్ ముమ్మరంగా సాగుతున్న తరుణంలో రైతులకు అత్యంత కీలకమైన యూరియా, డీఏపీ ఎరువుల కొరత తీవ్రంగా వేధిస్తోందని వీరు నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఎరువుల బ్లాక్ మార్కెట్ పెరిగిపోయిందని, సకాలంలో ఎరువులు అందక రైతులు అప్పుల ఊబిలోకి, నష్టాల కూపంలోకి నెట్టబడుతున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను గాలికొదిలేసి, రైతులను రోడ్డున పడేసిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని విమర్శించారు.

కేసీఆర్ పాలనే రైతులకు స్వర్ణయుగం

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతాంగాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నారని ఆయన గుర్తుచేశారు. నాడు విత్తనాలు, ఎరువుల కొరత అన్న మాటే వినపడలేదని, సాగునీరు, ఉచిత విద్యుత్, పెట్టుబడి సాయం అందించి వ్యవసాయాన్ని పండుగలా మార్చారని కొనియాడారు. కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పాలన ముమ్మాటికీ నిజమైన రైతు రాజ్యమని స్పష్టం చేశారు.

అన్ని సామాజిక వర్గాలకు అన్యాయం:

కాంగ్రెస్ పాలనలో కేవలం రైతాంగమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని సామాజిక వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో కులమతాలకు అతీతంగా, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి సామాజిక న్యాయం చేకూర్చారని. నేడు ఆ పరిస్థితి లేదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఎరువుల కొరతను తీర్చాలని, లేనిపక్షంలో రైతుల పక్షాన బీఆర్ఎస్ పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తుందని వీరు నాయక్ హెచ్చరించారు.