POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 4:22 pm Posted by : POLITICAL POWER

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై తెరాస (డి) పార్టీ మహాధర్నా

హామీల అమలు, రైతు-యువత-మహిళల సమస్యల పరిష్కారానికి డిమాండ్

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక / పిఎన్9 తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో జూన్ 04 2026: హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద గురువారం తెరాస (డి) పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ మహాధర్నా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నరాల సత్యనారాయణ నాయకత్వం వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ధర్నాలో మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించకపోవడం, ధాన్యం మరియు మక్కజొన్న కొనుగోళ్లు సక్రమంగా జరగకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, తులం బంగారం, రూ.500 గ్యాస్ సిలిండర్ వంటి హామీలు అమలు కాలేదని విమర్శించారు. ఆసరా పెన్షన్లు అర్హులైన వృద్ధులందరికీ అందడం లేదని, రైతు రుణమాఫీ, రైతుబంధు పెంపు, వ్యవసాయ కూలీలకు ఆర్థిక సాయం, పోడు భూముల పట్టాల పంపిణీ వంటి పథకాలు సక్రమంగా అమలు కావడం లేదని పేర్కొన్నారు. విద్యార్థులకు విద్యాభరోసా కార్డులు, ల్యాప్‌టాప్‌లు, స్కూటీలు అందించలేదని ఆరోపించారు. రాష్ట్రంలో నిరుద్యోగం, పేదరికం, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని, ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి విపరీతంగా పెరిగిందని విమర్శించారు. ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాల అమలులో కూడా అవినీతి చోటుచేసుకుంటోందని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్య సదుపాయాలు లేవని, కొన్ని పట్టణాల్లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. నీటిపారుదల, విద్యుత్, విద్యా రంగాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అమరవీరుల కుటుంబాలు, తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని, రైతులకు పిఏసిఎస్ మరియు ఆర్ ఆర్ బి ల ద్వారా వడ్డీ లేని రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ మహాధర్నాలో పార్టీ ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ గౌడ్, ఆదిలాబాద్ ఇన్‌చార్జ్ సింగం నగేష్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మైల సురేఖ, సోమయ్య, శ్రీకాంత్, మధు, గద్దాల లక్ష్మి, మందా లావణ్య, బైరాగి అరుణ, తార, శారద, పర్వీన్, శేఖర్, కిషోర్, మధుసూదన్, రాము, గౌస్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను వెంటనే అమలు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించాలని తెరాస (డి) పార్టీ నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.