నా కూలి డబ్బులు కూడా దొబ్బుకు తిన్నా పందికొక్కులు మీరు
కర్నె తండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపింది
కేవలం జిఓ లతో కమిషన్లు దండుకొని పోయింది దిష్టిబొమ్మ బి ఆర్ ఎస్ నాయకులు
-ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 24 2026: గత ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ప్రధాన కాలువలకు బొక్కలు పెట్టి కేవలం ప్రాజెక్టుల పేరున జీవోలు మంజూరు చేయించి కమిషన్లు దండుకు తిన్నారే తప్ప ఏ ప్రాజెక్టు నువ్వు పూర్తిస్థాయిలో నిర్మించలేదని నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నిలిచిపోయిన పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించే స్థాయికి ప్రాజెక్టును తీసుకువచ్చామని తెలిపారు. సోమవారం రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, నాగర్ కర్నూల్ శాసనసభ్యులు రాజేశ్వర్ రెడ్డిలతో కలిసి వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి కర్నేతండా లిఫ్ట్ ఇరిగేషన్ పంపులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రూ.87.53 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన కర్నె తండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లోని 18 తండాల పరిధిలో మొత్తం 4,235 ఎకరాలకు సాగునీరు అందనుందని తెలిపారు. ఇందులో వనపర్తి జిల్లాలో 3,384 ఎకరాలు, నాగర్‌కర్నూల్ జిల్లాలో 851 ఎకరాల ఆయకట్టు ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో రూ.87 కోట్లతో జీవో తీసుకువచ్చినా, సుమారు రూ.47 కోట్లు ఖర్చు చేసి పనులను మధ్యలోనే నిలిపివేశారని ఎమ్మెల్యే తెలిపారు. మిగిలిన పనులను ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దశలవారీగా పూర్తి చేస్తూ ఇప్పటివరకు సుమారు రూ.29 కోట్లు ఖర్చు చేసిందన్నారు. మిగిలిన పనులు, భూసేకరణ తదితర అంశాలకు అవసరమైన నిధులు సమకూర్చి ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చామని వివరించారు.
“తవ్విన కాలువలకు బొక్కలు పెట్టిన పందికొక్కులు మీరు”
కర్నె తండా లిఫ్ట్ ప్రాజెక్టుపై రాజకీయ విమర్శలు చేస్తున్న వారిపై ఘాటుగా స్పందించారు. ప్రధాన కాలువలను నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, కేవలం కాలువలకు బొక్కలు కొట్టి, కమిషన్ల కోసం జీవోలు తీసుకువచ్చినంత మాత్రాన దానిని అభివృద్ధిగా చెప్పుకోలేరని విమర్శించారు. “ప్రజల కోసం, రైతుల కోసం కాంట్రాక్టర్‌గా కాదు.. అవసరమైతే కూలోడిగా కూడా పనిచేశాను. నా నియోజకవర్గ ప్రజలకు నీళ్లు అందించాలన్న లక్ష్యంతో పగలు రాత్రి కష్టపడి కాలువలు తవ్వాం. కానీ మా బిల్లులను దొబ్బుకు తిన్నది మీరు” అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. రైతులకు నీళ్లు అందుతున్నాయన్న విషయం ప్రజలకు స్పష్టంగా తెలిసిన తర్వాత కూడా, ముందుగానే ప్రెస్‌మీట్లు పెట్టి “మేం చెబితేనే నీళ్లు వస్తున్నాయి” అన్న భావనను ప్రజల్లో కల్పించేందుకు చేస్తున్న పనికిమాలిన వ్యవహారాలు, ప్రయత్నాలు అందరికీ అర్థమవుతున్నాయని అన్నారు. ప్రాజెక్టు ప్రారంభంతో కర్నె తండా పరిధిలోని రైతుల సాగుభూములకు నీరు అందే పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. వనపర్తి జిల్లాలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, జిల్లాలో ఇప్పటివరకు సుమారు రూ.2,100 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.
కర్నె తండా ప్రాజెక్టుతో 4,235 ఎకరాలకు సాగునీరు మంత్రి కోమటిరెడ్డి
కర్నె తండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు అదనంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోందని తెలిపారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న మంత్రి, కర్నె తండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రారంభంతో ఈ ప్రాంత రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. గిరిజనుల ఆకాంక్ష మేరకు ప్రాజెక్టుకు శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్గా పేరు మార్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పేదల కోసం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం, రాష్ట్రవ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ, రోడ్ల అభివృద్ధి వంటి అనేక కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోందని మంత్రి తెలిపారు. పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర అబ్కారి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సంగ్రామ్‌సింగ్ పాటిల్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.