POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 1:05 pm Posted by : POLITICAL POWER

కాంట్రాక్టుల బిల్లులు క్లియర్ చేయించుకుని ప్రభుత్వాన్నే విమర్శిస్తారా?

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 15 2026: హైదరాబాద్ నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రభుత్వంపై ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయడాన్ని సహించేది లేదని సీఎం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి తనకు సంబంధించిన కాంట్రాక్టు బిల్లులను ప్రభుత్వం ద్వారా క్లియర్ చేయించుకుని, ఇప్పుడు అదే ప్రభుత్వాన్ని విమర్శించడం ఏమిటని రేవంత్ రెడ్డి ప్రశ్నించినట్లు సమాచారం. ప్రభుత్వ పనితీరుపై అభ్యంతరాలు ఉంటే పార్టీ, ప్రభుత్వం అంతర్గత వేదికలపై చర్చించాలని సూచించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడే ఎమ్మెల్యేల విషయంలో క్రమశిక్షణ పాటించేలా చూడాల్సిన బాధ్యత ఇన్‌చార్జ్ మంత్రులపై ఉందని సీఎం పేర్కొన్నట్లు సమాచారం. ఎమ్మెల్యేల వ్యాఖ్యలు ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించకుండా ఇన్‌చార్జ్ మంత్రులు సమన్వయం చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. కేబినెట్ సమావేశంలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ వ్యాఖ్యలపై సంబంధిత నేతల నుంచి అధికారికంగా పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.