
కామేపల్లి, నవంబర్ 12 (పొలిటికల్ పవర్ – ప్రతినిధి సత్యప్రసాద్):
ఇల్లందు నియోజకవర్గం కామేపల్లి మండలంలోని రైతు వేదికలో గురువారం సంక్షేమ కార్యక్రమాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, అర్హులైన లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన పింఛన్ పత్రాలతో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను తన చేతుల మీదుగా అందజేశారు.
602 మందికి పింఛన్ భరోసా:
నియోజకవర్గ పరిధిలో అర్హులై ఉండి పింఛన్ కోసం ఎదురుచూస్తున్న 602 మంది లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన పింఛన్ పత్రాలను ఎమ్మెల్యే కోరం కనకయ్య పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సాయం పేద, వృద్ధ, వితంతు కుటుంబాలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
వైద్య ఖర్చులకు రూ.25 లక్షల సీఎంఆర్ఎఫ్ సాయం:
అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించే స్థోమత లేని నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక భరోసా కల్పించారు. మండలంలోని 92 మంది బాధితులకు సుమారు రూ.25 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఆపదలో ఉన్న ప్రతి పేద కుటుంబానికి అండగా నిలవడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.