POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 10:14 pm Posted by : POLITICAL POWER

కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ప్రజా చైతన్య ఉద్యమం..

సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

బ్రహ్మంగారిమఠం ప్రచార యాత్రలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు యల్. నాగసుబ్బారెడ్డి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ కలసపాడు రిపోర్టర్ ప్రసాదరావు దేశ సమైక్యత, రాజ్యాంగ పరిరక్షణ, లౌకికవాదం, సమాఖ్య స్ఫూర్తి, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు భారత సిపిఐ దేశవ్యాప్త పిలుపు మేరకు 6 నుండి 15 వరకు నిర్వహిస్తున్న ప్రచార ఈరోజు బ్రహ్మంగారిమఠం ఐదు రోడ్ల సర్కిల్లో నిర్వహించిన కార్యక్రమం లో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు యల్. నాగసుబ్బారెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “సబ్ కా సాథ్ – సబ్ కా వికాస్” పేరుతో అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను విస్మరించి, దేశ సంపదను కొద్దిమంది పెద్ద కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకు అనుకూలంగా వినియోగిస్తోందని విమర్శించారు. నిరుద్యోగం, పేదరికం, ధరల పెరుగుదల, రైతాంగ సంక్షోభం, విద్యా–వైద్య రంగాల సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతున్నప్పటికీ వాటి పరిష్కారంపై దృష్టి పెట్టకుండా ప్రజల మధ్య విభజన రాజకీయాలను ప్రోత్సహించడం ఆందోళనకరమని అన్నారు. దేశ యువతకు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ అమలుకాలేదని, నిరుద్యోగం చరిత్రలో ఎన్నడూ లేనంతగా పెరిగిందని విమర్శించారు. ప్రభుత్వ శాఖల్లో లక్షలాది ఖాళీ పోస్టులు ఉన్నప్పటికీ నియామకాలు చేపట్టకుండా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానాలను ప్రోత్సహించడం యువత భవిష్యత్తును చీకటిలోకి నెడుతోందన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పిన ప్రభుత్వం విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, డీజిల్, విద్యుత్ ఖర్చులు పెరగకుండా నియంత్రించడంలో విఫలమైందన్నారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీ ఇవ్వకపోవడం, పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను వరుసగా ప్రైవేటీకరణ చేయడం వల్ల లక్షలాది ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నాయని, ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటు చేతుల్లోకి వెళ్లే పరిస్థితి ఏర్పడుతోందని విమర్శించారు. బ్యాంకులు, బీమా, రైల్వే, విమానయాన, పోర్టులు, గనులు, విద్యుత్ వంటి వ్యూహాత్మక రంగాల్లో ప్రభుత్వ పాత్రను తగ్గించడం దేశ ఆర్థిక స్వావలంబనకు ప్రమాదకరమని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయకుండా కార్పొరేట్ విద్యను ప్రోత్సహించడం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులో లేకుండా పోతోందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు తగిన నిధులు, సిబ్బంది, మౌలిక వసతులు కల్పించకుండా ప్రైవేటు వైద్య వ్యవస్థపై ప్రజలను ఆధారపడేలా చేస్తున్నారని విమర్శించారు. మహిళల భద్రత, సాధికారత గురించి గొప్పలు చెప్పే ప్రభుత్వాలు మహిళలపై జరుగుతున్న దాడులు, బాలికలపై నేరాలను అరికట్టడంలో ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయాయని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల రాజ్యాంగ హక్కులను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, శ్రమజీవుల కష్టం ద్వారా సృష్టించబడిన సంపద కొద్దిమంది పెద్ద వ్యాపార వర్గాల చేతుల్లో కేంద్రీకృతమవుతోందనే విమర్శలు వస్తున్నాయని పేర్కొన్నారు. దేశ సంపద ఫలాలు అందరికీ సమానంగా అందేలా ప్రజా సంక్షేమ విధానాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి రావలసిన ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు పూర్తి, కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు, రాయలసీమ అభివృద్ధి ప్యాకేజీ, ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం మరింత గట్టిగా ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. దేశ సమైక్యత, ప్రజల జీవన హక్కులు, సామాజిక న్యాయం, ఉపాధి, విద్య, వైద్యం, రైతాంగ పరిరక్షణ, కార్మిక హక్కుల సాధన కోసం ఆగస్టు 6 నుండి 15 వరకు జరిగే ప్రచార పాదయాత్రల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని, అలాగే సెప్టెంబర్ 1న జరిగే “చలో ఢిల్లీ” కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రజల స్వరాన్ని దేశ రాజధానిలో బలంగా వినిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీరాములు ఏరియా కార్యదర్శి షేక్ షావల్లి మండల కార్యదర్శి ప్రభాకర్, మండల సహాయ కార్యదర్శులు నారాయణ, రవి ఏఐవైఎఫ్ కార్యదర్శి సురేష్, సుజన్, సుమంత్ తదితరులు పాల్గొన్నారు.