కీలక పదవి ఇవ్వనున్నారనే ప్రచారం.. కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ సెప్టెంబర్ 13 2026: హన్మకొండ: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కొండా కుటుంబం పేరు చర్చనీయాంశంగా మారింది. మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సురేఖకు పార్టీ పరంగా కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆదివారం హన్మకొండలోని తమ నివాసంలో కొండా సురేఖ, కొండా మురళీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పార్టీ భవిష్యత్ కార్యాచరణ, తాజా రాజకీయ పరిణామాలు, ఢిల్లీ పర్యటనకు సంబంధించిన అంశాలపై కార్యకర్తలతో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కొండా మురళీ ముఖ్య కార్యకర్తలతో మాట్లాడుతూ.. కొండా సురేఖకు అధిష్టానం కీలక పదవి ఇవ్వనున్నట్లు వెల్లడించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఆ పదవి ఏమిటనే అంశంపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. ముఖ్య కార్యకర్తల సమావేశం అనంతరం కొండా సురేఖ ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను కలవనున్నట్లు సమాచారం. ఈ భేటీలో తెలంగాణ కాంగ్రెస్‌లో తాజా రాజకీయ పరిణామాలతో పాటు సురేఖకు అప్పగించనున్న బాధ్యతలపై చర్చ జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే కొండా సురేఖ ఢిల్లీ పర్యటన, కాంగ్రెస్ అధిష్టానంతో సమావేశాలపై రాజకీయ చర్చలు జరిగిన నేపథ్యంలో తాజా పరిణామం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
అసలు మతలబు ఏంటి?
కొండా సురేఖను ఢిల్లీకి పిలవడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? ఆమెకు ఎలాంటి కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారు? రాష్ట్ర రాజకీయాల్లో ఆమె పాత్రను మరింత విస్తరించనున్నారా? లేక పార్టీకి సంబంధించిన కీలక బాధ్యతను అప్పగించనున్నారా? అనే ప్రశ్నలు కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చకు వస్తున్నాయి. అయితే అధిష్టానం నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు సురేఖకు ఇవ్వనున్న పదవిపై వస్తున్న వార్తలను రాజకీయ వర్గాల చర్చగానే చూడాల్సి ఉంటుంది. ఢిల్లీ భేటీ అనంతరం ఈ అంశంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.