POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 01 June 2026, 6:55 am Posted by : POLITICAL POWER

కొత్తకోటలో మూడేళ్ల బాలుడిపై పిచ్చికుక్క దాడి

ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల లేమిపై కుటుంబ సభ్యుల ఆవేదన

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 01 2026: కొత్తకోట మున్సిపాలిటీ 15వ వార్డుకు చెందిన ఎండీ అఖిల్ ఖాన్ మూడేళ్ల కుమారుడిపై ఆదివారం ఉదయం పిచ్చికుక్క దాడి చేసిన ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది.ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై అకస్మాత్తుగా దాడి చేసిన కుక్క చెంపలు, పెదవులపై తీవ్రంగా గాయపరిచింది. దీంతో బాలుడికి తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన కొత్తకోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకున్నప్పటికీ ఉదయం 11 గంటల వరకు వైద్యులు అందుబాటులో లేరని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అక్కడ ఉన్న ఒక మహిళా సిబ్బంది బాలుడి పరిస్థితిని గమనించి ఇంజెక్షన్ ఇచ్చినప్పటికీ, ఎలాంటి చికిత్స అందించారో రాతపూర్వకంగా తెలియజేయలేదని వారు వాపోయారు.ఈ విషయాన్ని బాధిత కుటుంబ సభ్యులు స్థానిక ఎమ్మెల్యేకు ఫోన్ ద్వారా తెలియజేయగా, ఆయన కాంగ్రెస్ నాయకుడు మేస్త్రి శ్రీనుకు సమాచారం అందించినట్లు తెలిపారు. అనంతరం జరిగిన ఫోన్ సంభాషణలో ఆదివారం కావడంతో వైద్యులు రాలేదని చెప్పారని, అత్యవసర పరిస్థితుల్లో కూడా సరైన వైద్య సేవలు అందకపోవడం బాధాకరమని బాలుడి తండ్రి అఖిల్ ఖాన్ పేర్కొన్నారు. ప్రభుత్వాసుపత్రిలో తగిన మందులు, సదుపాయాలు లేకపోవడంతో సాధారణ చికిత్సల కోసం కూడా బయట నుంచి మందులు కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజలు అధికంగా నివసించే కొత్తకోట పట్టణంలో ప్రభుత్వాసుపత్రిని అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేయాలని, వైద్యుల అందుబాటును నిర్ధారించాలని జిల్లా అధికారులను కోరారు. అదేవిధంగా పట్టణంలోని పలు వార్డుల్లో వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉందని, వాటి నియంత్రణకు మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.