
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిధి :
ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల హక్కులకు రక్షణ కవచంగా నిలవాల్సిన చట్టాలు కొత్తగూడ మండల కేంద్రంలో కాగితాలకే పరిమితమవుతున్నాయి. గిరిజన ప్రాంతాల్లో భూమిని, స్వయంపాలనను పరిరక్షించే 1/70 చట్టం, పెసా (PESA) నిబంధనలను బహిరంగంగా కాలరాస్తూ గిరిజనేతరులు సాగిస్తున్న అక్రమ బహుళ అంతస్తుల నిర్మాణాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆదివాసీల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి సాగుతున్న ఈ కాంక్రీట్ దందాపై ‘ఆదివాసి హక్కుల పోరాట సమితి – తుడుందెబ్బ’ మండల కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పంచాయతీ కార్యదర్శికి సంచలన వినతిపత్రం అందజేసింది.
తక్షణమే కూల్చివేయాలి.. లేకుంటే తిరుగుబాటే!
మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా వెలసిన, ప్రస్తుతం నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనాలపై అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని తుడుందెబ్బ డిమాండ్ చేసింది.
చట్టవిరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను వెంటనే గుర్తించి బుల్‌డోజర్లతో కూల్చివేయాలి.గ్రామ పంచాయతీ పాలకవర్గం పూర్తిగా ఏజెన్సీ చట్టాలకు కట్టుబడి పనిచేయాలి.
అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన, చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులపై శాఖాపరమైన విచారణ జరపాలి.
అధికారులు ప్రేక్షక పాత్ర వహించి ఈ దందాను ప్రోత్సహిస్తే చూస్తూ ఊరుకునేది లేదని, ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం మండలవ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు.