POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 12:05 pm Posted by : POLITICAL POWER

కోర్టు మీదనే కోర్టు విచారణ..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రెవెన్యూ శాఖలో అవినీతి ఆరోపణలు – హైకోర్టు విజిలెన్స్ విచారణ ఆదేశాలు చర్చనీయాంశం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి ప్రపంచ న్యాయ చరిత్రలోనే అరుదుగా కనిపించే ఒక విచిత్ర పరిణామం తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని రెవెన్యూ విభాగం (ఏజెంట్ టు గవర్నమెంట్ కోర్టు)లో చోటుచేసుకుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశం జిల్లాలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అవినీతి పరాకాష్టకు చేరినప్పుడు, ఒక దశలో ఆ అక్రమాలు బయటపడక తప్పవని మరోసారి హైకోర్టు పరిణామాలు సూచిస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఈ అంశంపై పొలిటికల్ పవర్ పలు కథనాల ద్వారా రెవెన్యూ శాఖను హెచ్చరించింది. బాధితులు హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని పేర్కొన్నట్లుగానే, వారు గౌరవ హైకోర్టును ఆశ్రయించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్నట్లు ఆరోపిస్తున్న అక్రమాలు, అవినీతి గురించి పూర్తి వివరాలు సమర్పించారు. దీనిపై స్పందించిన హైకోర్టు జూన్ 19న సంబంధిత అంశంపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అనంతరం బాధితులు జూలై 7న సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ, ఈరోజు వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. అంతేకాక, ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి కూడా వెళ్లనీయకుండా రెవెన్యూ శాఖలోని కొందరు అధికారులు వ్యవహరించారని, సంబంధిత అధికారిని కాపాడే ప్రయత్నం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. సామాజిక బాధ్యతతో పొలిటికల్ పవర్ జూలై 26న బాధితులతో కలిసి కలెక్టర్‌ను కలిసింది. ఈ సందర్భంగా కలెక్టర్ స్పందిస్తూ, “ఇంతవరకు ఈ విషయం నా దృష్టికి రాలేదు” అని తెలిపినట్లు సమాచారం. అయితే బాధితులు సమాచార హక్కు చట్టం (RTI), ఫిర్యాదు పత్రాలు తదితర మార్గాల ద్వారా సుమారు 24 సార్లు ఫిర్యాదులు సమర్పించినప్పటికీ అవి కలెక్టర్ దృష్టికి చేరకుండా అడ్డుకున్నారని వారు ఆరోపిస్తున్నారు. బాధితుల వాదన ప్రకారం, ఏజెంట్ టు గవర్నమెంట్ కోర్టులో పనిచేస్తున్న ఒక అధికారి, ఆయన సహాయకుడు జారీ చేసే ఆదేశాలు అనేక రెవెన్యూ కేసులపై ప్రభావం చూపుతున్నాయని, ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొస్తున్న పొలిటికల్ పవర్ ఎడిటర్‌కు ఫోన్ ద్వారా బెదిరింపులు కూడా వస్తున్నాయని పేర్కొన్నారు. అలాగే, సంబంధిత అధికారి గత 11 సంవత్సరాలుగా ఒకే సీటులో కొనసాగుతూ, రాజకీయ అండతో వివిధ విభాగాలకు బదిలీలు చేయించుకుంటూ జిల్లాలో ప్రభావం చూపుతున్నారని, హైకోర్టు నుంచి వచ్చే ఆదేశాల అమలులో కూడా అవినీతి జరిగిందని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో కొందరు అధికారుల ముఠా కలిసి అక్రమాలకు పాల్పడుతున్నట్లు కూడా బాధితులు పేర్కొంటున్నారు. ఇదే అంశంపై గతంలో కథనాలు ప్రచురించిన సమయంలో కూడా సంబంధిత అధికారుల వర్గం నుంచి పొలిటికల్ పవర్ మీడియాకు బెదిరింపులు వచ్చినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో స్థానిక కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న సంబంధిత సూపరింటెండెంట్‌పై సమగ్ర విచారణ జరిపి, ఆరోపణలు నిజమైతే క్రిమినల్ చర్యలు తీసుకుని సామాన్య ప్రజలకు న్యాయం చేయాలని బాధితులు కలెక్టర్‌ను కోరుతున్నారు. పూర్తి, సమగ్ర సమాచారం కోసం నిత్యం సామాన్య ప్రజలకు అందుబాటులో… మీ పొలిటికల్ పవర్.