POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 11 November 2026, 11:53 pm Posted by : POLITICAL POWER

ఖమ్మంలో టీఆర్పీ టౌన్ కమిటీ నియామకం.. నవంబర్ 19న ప్రారంభమయ్యే బీసీ రాజ్యాధికార పాదయాత్రను విజయవంతం చేయాలి బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ఉద్యమంలో భాగస్వాములు కావాలి: టీఆర్పీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు దామాల సత్యం

 

ఖమ్మం, టౌన్ నవంబర్ 11: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి

 

తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు, సంస్థాగత నిర్మాణంలో భాగంగా బుధవారం ఖమ్మం టౌన్ కమిటీని ఏర్పాటు చేసి పలువురు నాయకులకు వివిధ బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీఆర్పీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు దామాల సత్యం, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు తేలపుట్ట జగపతి హాజరయ్యారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో నూతన కమిటీని ప్రకటించి నియామక పత్రాలు, పార్టీ కండువాలు అందజేశారు. ఖమ్మం నగర ప్రధాన కార్యదర్శిగా కేతవరపు లెనిన్, టౌన్ కార్యదర్శిగా తాడిశెట్టి ఉపేందర్, కార్యదర్శిగా దేవరకొండ రామారావు, విద్యార్థి విభాగం బాధ్యతల్లో బొమ్మిడి శాంతన్ ,అదురి అజయ్ తో పాటు పలువురిని నియమించారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దామాల సత్యం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజకీయ అధికారం సాధించాలనే లక్ష్యంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేపట్టిన బీసీ రాజ్యాధికార యాత్ర సెప్టెంబర్ 17న గోల్కొండ కోట నుంచి ప్రారంభమై ప్రస్తుతం నల్గొండ జిల్లాలో కొనసాగుతోందని తెలిపారు. ఈ యాత్ర నవంబర్ 19 నుంచి ఖమ్మం జిల్లాలో ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజలు, యువత, విద్యార్థులు, ప్రజాసంఘాల నాయకులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

బీసీలకు జనాభా ప్రాతిపదికన రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో తగిన వాటా, అధికారం దక్కాలంటే ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉద్యమించాలని అన్నారు. ఖమ్మం జిల్లాలోని ప్రతి మండలం, ప్రతి గ్రామం, ప్రతి పట్టణం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్వచ్ఛందంగా తరలివచ్చి పాదయాత్రకు ఘనస్వాగతం పలకాలని కోరారు. తీన్మార్ మల్లన్న ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి తెలంగాణలో బీసీల రాజ్యాధికారం సాధించే దిశగా ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా కృషి చేయాలని అన్నారు.

అనంతరం పార్టీలో నూతనంగా చేరిన కేతవరపు లెనిన్, తాడిశెట్టి ఉపేందర్, రామారావు, బొమ్మిడి శాంతన్ తదితరులకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. తీన్మార్ మల్లన్న ఆలోచనలు, బీసీల రాజ్యాధికార సాధన లక్ష్యాలు, సామాజిక న్యాయం పట్ల ఆకర్షితులై తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరినట్లు నూతన నాయకులు తెలిపారు. పార్టీ అభివృద్ధికి, రాబోయే బీసీ రాజ్యాధికార పాదయాత్ర విజయవంతానికి తమ వంతు కృషి చేస్తామని వెల్లడించారు.

నూతనంగా నియమితులైన నాయకులు పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దామాల సత్యం సూచించారు.

నవంబర్ 19న ఖమ్మం గడ్డపై ప్రారంభమయ్యే బీసీ రాజ్యాధికార పాదయాత్రను విజయవంతం చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కదలిరావాలని టీఆర్పీ నాయకులు పిలుపునిచ్చారు.