POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 17 August 2026, 6:03 pm Posted by : POLITICAL POWER

ఖమ్మంలో నిబంధనలకు విరుద్ధంగా పర్మిట్ రూములు.. చర్యలు తీసుకోవాలని వినతి

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి: ఖమ్మం నగర పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న మద్యం దుకాణాల పర్మిట్ రూములపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పలు వైన్‌షాపులకు అనుబంధంగా ఉన్న పర్మిట్ రూముల్లో అనుమతించిన పరిమితికి మించి సిట్టింగ్ ఏర్పాటు చేస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా విస్తృతంగా నిర్వహిస్తున్నారని వారు ఆరోపించారు. అదేవిధంగా పర్మిట్ రూముల్లో తినుబండారాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారని, ప్లాస్టిక్ వినియోగంపై ఉన్న నిబంధనలను పట్టించుకోకుండా ప్లాస్టిక్‌ను అధికంగా ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. ఖమ్మం పరిసర ప్రాంతాల్లో కూడా భారీ సిట్టింగ్‌తో పర్మిట్ రూములను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు తగిన పర్యవేక్షణ చేయడం లేదని ఆరోపించారు. ఈ సమస్యలపై వెంటనే తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న మద్యం దుకాణాలు, పర్మిట్ రూములపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ దళిత సంఘాల నాయకులు గుండ్ల రవికుమార్ మాదిగ, పేర్ల మధు మాదిగ, మారబత్తుల హరీష్ మాదిగ తదితరులు సోమవారం మద్యపాన నిషేధ, ఎక్సైజ్ శాఖ జిల్లా పర్యవేక్షణ అధికారి జానయ్యకు వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన అధికారి, ఫిర్యాదును పరిశీలించి త్వరలో తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.