POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 27 July 2026, 12:48 pm Posted by : POLITICAL POWER

ఖమ్మం నగరంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ పనుల పురోగతిని పరిశీలించిన మంత్రి తుమ్మల

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం, జూలై 27 2026: మ్మం నగరంలో చేపడుతున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణ పనులను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పనుల పురోగతిని సమీక్షించి, నాణ్యతతో పాటు నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ… గతంలో ఖానాపురం చెరువు అలుగు వరదల కారణంగా నగరంలోని పలు డివిజన్లు ముంపునకు గురై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. ఇకపై అలాంటి పరిస్థితులు తలెత్తకుండా సుమారు ₹100 కోట్ల వ్యయంతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ పైప్‌లైన్ నిర్మాణం చేపట్టామని తెలిపారు. వర్షపు నీటిని వేగంగా తరలించే విధంగా ఈ వ్యవస్థను రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఖమ్మం నగరానికి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. కృష్ణా నది నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడినా, గోదావరి జలాలతో తాగునీటి అవసరాలను తీర్చేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే గోదావరి జలాలను మున్నేరు వరకు తరలించినట్లు తెలిపారు. నగరంలో వరద ముంపు సమస్యతో పాటు తాగునీటి ఇబ్బందులను శాశ్వతంగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి చెప్పారు. అమృత్ పథకం కింద సుమారు ₹200 కోట్ల వ్యయంతో తాగునీటి పనులు కొనసాగుతున్నాయని, ఆటోమేషన్ విధానంలో ప్రజలకు నాణ్యమైన రక్షిత తాగునీటిని సరఫరా చేసే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఖమ్మం నగర అభివృద్ధికి, అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ మరియు తాగునీటి పథకాల అమలుకు పూర్తి సహకారం అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. నగర ప్రజలకు వరద ముప్పు, తాగునీటి కష్టాలు లేకుండా శాశ్వత పరిష్కారం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.