పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ విశ్లేషణాత్మక కథనం విభజించి పాలించడం రాజ్యాంగంలో లేదు. కానీ మండలంలో ఓ ఎస్సై రాస్తున్నది అదే రాగం. ఖాకీ బట్టలో ఉన్నా బుద్ధంతా రాజకీయ నాయకుడి పట్లే. అధికార పార్టీ అండ చూసుకొని చట్టాన్ని తన చెంతనే పెట్టుకున్నాడు. అవసరానికి అనుకూల విన్యాసం, అందరినీ మోసం చేసే నైపుణ్యం. ఉదయం ప్రజాసేవకుడి మాటలు, సాయంత్రం నాయకుడి ఆటలు. అంతలోనే అమాయకపు నవ్వులు, అందరినీ నమ్మించే కవ్వింపులు. ఎదుటివారిని మాట్లాడనివ్వడు, ఎదురుదాడితో వారిని పడగొడతాడు. ఇతరుల ముందు నిర్దోషి అవతారం, లోలోపల శిక్షల కారాగారం. సెక్షన్ లేకున్నా శిక్షిస్తాడు, చట్టాన్ని చేతిలో ఆడిస్తాడు. ఇష్టానుసారం కేసుల బెడద, ఇష్టం వచ్చినట్టు మాటల వరద. “మాది మధ్యతరగతి” అంటూ డప్పు కొడతాడు, మనసులో మాత్రం కుట్రలు నింపుతాడు. “అవకాశాన్ని అందుకోవాలి” అని ఉపదేశం, అదే అవకాశాన్ని చిదిమేసే దుర్నీతం. “కుటుంబ విలువలు” అంటూ కబుర్లు, కుటుంబాలను రోడ్డున పడేసే బెదుర్లు. వేద పండితులతో ఏకమైన బంధాన్ని విడగొట్టాలనుకున్నాడు సారు. ఏ క్షణాన చేసుకున్న పుణ్యమో, కలిసి వచ్చారు తమ వారు. చెరిపేలా చేసిన వారి పనులు, చెరగనివ్వలేదు చివరికి తమ జీవిత కలలు. వేదమంత్రాలతో ఏకమైన బంధం విడిపోయేంత దూరం చేశాడు. చివరికి ఏ క్షణాన్నో చేసిన పుణ్యం ఎదురై, ఒక్కసారిగా కలిసే క్షణాలను చెరిపేస్తే ఇలానా సారూ? కుటుంబాలను కూల్చేస్తూ, బంధాలను తెంచేస్తూ, మానవత్వం మరిచి మసలుతున్నాడు. లేనివి ఉన్నట్టు చిత్రీకరణ, ఉన్నవి లేనట్టు మాయీకరణ. ఫిర్యాదు చేసినవారినే నిందితులుగా చూపడం, పథకాలన్నీ అనుచరులకే అప్పగించడం. ప్రశ్నిస్తే బెదిరింపుల దండయాత్ర, న్యాయం అడిగితే కేసుల తాండవం. “మండలంలో నియంత లేనే లేడు” అని ప్రగల్భాలు, మహిళలతో తలుపులు తెరిపించే దురాగతాలు. తప్పు లేకున్నా అధికార దర్పం, నిజాన్ని అబద్ధంగా మార్చే వైఖరి. ఈయన మరిచాడు గతంలో ఎదురైన అడ్డంకులు, మరిపిస్తున్నాడు భయంకరమైన నిజాలు. మళ్ళీ పయనిస్తున్నాడు నిర్భాగ్యమైన తోవలో, మండలాన్ని ముంచుతున్నాడు కుట్రల వలలో. ఆయన అక్రమాలు రాస్తే రామాయణం, ప్రతి అడుగులోనూ కుట్రల కార్యం. ప్రజాసేవకుడు కావాల్సినవాడు, విభజన రాజకీయాలతో పబ్బం గడుపుతున్నాడు. అధికార పార్టీ అండదండలు, అందుకే ఆయనకు లేవు భయాలు.
చట్టం చెప్పిన సత్యం
తెలంగాణ హైకోర్టు తీర్పు స్పష్టం. విమర్శించడం నేరం కాదు సుస్పష్టం. ఆర్టికల్ 19(1)(a) హక్కు మనది, భావప్రకటనా స్వేచ్ఛ బలం మనది. యాంత్రికంగా కేసులు పెట్టడం తప్పు, రాజ్యాంగానికే అది వ్యతిరేకం. మరి ఈ ఎస్సై చేసేదేమిటి? కోర్టు తీర్పును తొక్కేసి, సాక్ష్యం లేకుండా కేసులు మోపేసి, ఖాకీ ముసుగులో రాజకీయం చేస్తున్నాడు. ప్రజలు మౌనంగా రోదిస్తున్నారు, న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఉన్నతాధికారులు కళ్లు తెరవాలి, ఈ అలిఖిత రాజ్యాంగానికి అడ్డుకట్ట వేయాలి. లేకపోతే ప్రజాస్వామ్యం పేరుతో నియంతృత్వం రాజ్యమేలుతుంది, సామాన్యుడి బతుకు బుగ్గి అవుతుంది. ఖాకీ ధరించినవాడు న్యాయం కాపాడాలా? లేక కుటుంబాలను కూల్చి పాపం మూటగట్టుకోవాలా? పుణ్యం తోడై నిలిచినవారిని చెరిపేయాలనుకుంటే, చరిత్ర క్షమిస్తుందా సారూ? ఖాకీరాజకీయం ప్రజాస్వామ్యంప్రమాదంలో భావప్రకటనాస్వేచ్ఛ అలిఖితరాజ్యాంగం పోలీసుదుర్వినియోగం
గమనిక: ఈ కథనం మండలంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా ప్రజా ప్రయోజనార్థం రూపొందించబడింది. ఎవరినీ వ్యక్తిగతంగా ఉద్దేశించినది కాదు. సమాచార హక్కు చట్టం మరియు భావప్రకటనా స్వేచ్ఛకు లోబడి ప్రచురించడమైనది.