POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 14 September 2026, 9:02 am Posted by : POLITICAL POWER

గణపయ్య రాకకు.. ఘనంగా ఏర్పాట్లు!

 

గ్రామగ్రామాన మండపాల ముస్తాబు.. భక్తుల మాలధారణతో ఆధ్యాత్మిక సందడి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ అశ్వారావుపేట రిపోర్టర్ వడితే గణేష్ సెప్టెంబర్ 14 2026: వినాయక చవితి వేడుకలకు అశ్వారావుపేట మండలంలో సందడి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణం వరకు గణనాథుని ప్రతిష్ఠకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సోమవారం ప్రారంభం కానున్న ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు మండపాలను సిద్ధం చేస్తున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో ఇప్పటికే వినాయక విగ్రహాలను మండపాలకు తరలించారు. విగ్రహ ప్రతిష్ఠ, పూజా కార్యక్రమాలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మండపాలను విద్యుత్ దీపాలు, అలంకరణలతో తీర్చిదిద్దుతున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా సౌకర్యాలు కల్పిస్తున్నారు.గణనాథునిపై భక్తితో పలువురు మాలధారణ చేపట్టి దీక్షలు కొనసాగిస్తున్నారు. మొక్కులు చెల్లించుకుని వినాయకుడి అనుగ్రహం పొందాలని భక్తులు ఆకాంక్షిస్తున్నారు. పండుగ రోజుల్లో మండపాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

 

 

నిబంధనలు పాటిస్తూ వేడుకలు

వినాయక మండపాల వద్ద డీజేలకు అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేయడంతో నిర్వాహకులు నిబంధనలకు అనుగుణంగా వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. భక్తి, ఆధ్యాత్మికతకు ప్రాధాన్యం ఇస్తూ ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

అందరికీ శుభాలు కలగాలని ఆకాంక్ష

విఘ్నాలను తొలగించే గణనాథుని ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, శుభాలు కలగాలని భక్తులు కోరుకుంటున్నారు.