POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 28 August 2026, 5:46 pm Posted by : POLITICAL POWER

గిరిజనుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది

ప్రతి తండా అభివృద్ధే లక్ష్యం..

గిరిజనుల ఆత్మగౌరవం, సంక్షేమానికి పెద్దపీట 

నియోజకవర్గస్థాయి గిరిజనుల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 28 2026: గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి పనిచేస్తోందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. గిరిజనుల జీవితాల్లో శాశ్వతమైన మార్పు తీసుకురావడంతో పాటు ప్రతి తండాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. శుక్రవారం వనపర్తి నియోజకవర్గం పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి గిరిజనుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై గిరిజనులతో ఆత్మీయంగా మాట్లాడారు. ఈ సందర్భంగా గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. గిరిజనులు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. గిరిజనుల హక్కులు, సంక్షేమం, ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుండి పోరాడిందని పేర్కొన్నారు. ప్రజల కోసం పనిచేసే ప్రతి ఒక్కరినీ కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ నాయకత్వం గౌరవిస్తుందని అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి తండాలో ఇల్లు లేని గిరిజన కుటుంబాలను గుర్తించి ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అర్హత ఉన్న ఏ ఒక్క పేద కుటుంబం కూడా సొంత ఇంటికి దూరం కాకుండా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. వనపర్తి నియోజకవర్గ పరిధిలోని 32 తండా గ్రామపంచాయతీల్లో సేవాలాల్ మహారాజ్ ఆలయాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. గిరిజనుల ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవిస్తూ సేవాలాల్ మహారాజ్ గుడుల చేపడతాం అన్నారు. అదేవిధంగా ఖిల్లా ఘణపురం మండల కేంద్రంలో సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి తండాకు రోడ్డు.. ప్రతి తండాకు అభివృద్ధి నియోజకవర్గంలోని ప్రతి తండాకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. తండాల నుంచి మండల, నియోజకవర్గ కేంద్రాలకు రాకపోకలు సులభతరం అయ్యేలా రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను సమర్థవంతంగా వినియోగించి ప్రతి గిరిజన గ్రామపంచాయతీని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. తండాల్లో మౌలిక వసతులు, రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం వంటి రంగాలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. సాగునీటి సమస్యతో గిరిజన రైతులు ఇబ్బందులు పడకుండా అన్ని తండాలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రైతుల భూములకు నీరు అందితేనే గిరిజన కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని అన్నారు. కర్నే తండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు “శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ ప్రాజెక్ట్”గా నామకరణం చేయిస్తున్నట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపిస్తాం గిరిజనుల పోడు భూముల సమస్యపై ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకునేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. గిరిజన రైతుల భూములకు సంబంధించి ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రతి తండాకు హెల్త్ సెంటర్ ఉండేలా చర్యలు గిరిజన తండాల ప్రజలు వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రతి తండాకు ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండేలా, అవసరమైన చోట హెల్త్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గిరిజనుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. పాత, కొత్త సర్పంచుల పెండింగ్ బిల్లుల పరిష్కారం గ్రామాల అభివృద్ధికి పనిచేసిన పాత, కొత్త సర్పంచుల పెండింగ్ బిల్లులను చెల్లించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గ్రామాల అభివృద్ధి కోసం పనిచేసిన ప్రజాప్రతినిధులకు న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సంక్షేమానికి పెద్దపీట తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలు, రైతులు, మహిళలు, యువత, గిరిజనులు, బలహీన వర్గాల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టిందని ఎమ్మెల్యే వివరించారు. రైతులకు రైతు భరోసా, మహిళలకు మహాలక్ష్మి పథకం, ఉచిత బస్సు ప్రయాణం, పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు, గృహ విద్యుత్ వినియోగదారులకు ఉచిత విద్యుత్, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన, విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు, అర్హులైన కుటుంబాలకు వివిధ సంక్షేమ పథకాల అమలు వంటి కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందని తెలిపారు. అదేవిధంగా పేదలు, బడుగు బలహీన వర్గాలు, గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. వనపర్తి నియోజకవర్గ అభివృద్ధికి రూ.2,000 కోట్లకు పైగా పనులు వనపర్తి నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ.2,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులు, చేపట్టినట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. రోడ్లు, విద్య, వైద్యం, సాగునీరు, మౌలిక వసతులు, తాగునీరు, గ్రామీణాభివృద్ధి తదితర రంగాల్లో పెద్దఎత్తున పనులు చేపడుతున్నామని తెలిపారు.

24 గంటలు ప్రజల కోసం పనిచేస్తా

వనపర్తి నియోజకవర్గ అభివృద్ధి కోసం 24 గంటలు పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. పదవిని ప్రజలకు సేవ చేసే అవకాశంగా భావిస్తున్నానని, నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, ప్రతి తండా అభివృద్ధి చెందే వరకు విశ్రమించబోనని స్పష్టం చేశారు. గిరిజనుల సమస్యలను తన సమస్యలుగా భావించి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. తండాల అభివృద్ధి విషయంలో ఎక్కడా వివక్ష లేకుండా అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. “ప్రతి తండా అభివృద్ధి చెందాలి.. ప్రతి గిరిజన కుటుంబం ఆత్మగౌరవంతో జీవించాలి.. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలి.. ప్రతి రైతు భూమికి సాగునీరు అందాలి.. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ఇదే నా సంకల్పం” అని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంగంపల్లి స్థానిక సర్పంచ్ రమేష్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు వాల్యానాయక్, దిశా కమిటీ సభ్యులు రవి నాయక్, జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు విజయలక్ష్మి, మాజీ సర్పంచ్ రాధాకృష్ణ, అనకాపల్లి గ్రామ సర్పంచ్ ఆంజనేయులు నాయక్, కోతులకుంట తండా సర్పంచ్ పాండు నాయక్, వనపర్తి మాజీ ఎంపీపీ శంకర్ నాయక్, ఎంపీటీసీ నాగరాజు నాయక్ తదితరులతో పాటు పలు గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గిరిజన పెద్దలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.