POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 9:07 pm Posted by : POLITICAL POWER

ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

పెద్దమందడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వేడుకలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 17 2026: పెద్దమందడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ జి. సైదులు సర్దార్ వల్లభభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రిన్సిపాల్ జి. సైదులు మాట్లాడుతూ… సెప్టెంబర్ 17వ తేదీ హైదరాబాద్ రాష్ట్రం నిజాం పాలన నుంచి విముక్తి పొంది భారతదేశంలో విలీనం అయిన చారిత్రక దినమని పేర్కొన్నారు. నిజాం పాలనలో ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యం పరిమితంగా ఉండేదని, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆర్య సమాజం, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్టు ఉద్యమాలు ప్రజలను చైతన్యపరిచాయని తెలిపారు. ప్రజలకు స్వేచ్ఛ, ప్రజాస్వామ్య హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం సంస్థానాల విలీన ప్రక్రియను చేపట్టిందని వివరించారు. కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేతృత్వంలో సంస్థానాల విలీన ప్రక్రియ వేగవంతమైందని, దేశ సమైక్యతలో పటేల్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. హైదరాబాద్ రాష్ట్ర విలీన ప్రక్రియలో భాగంగా 1948 సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ పోలో అనంతరం నిజాం ప్రభుత్వం భారత ప్రభుత్వానికి లొంగిపోయిందని సైదులు తెలిపారు. సెప్టెంబర్ 17 చారిత్రక ప్రాధాన్యత కలిగిన రోజుగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, తిరుపతయ్య, చెన్నకేశవులు, గోవర్ధన్, నరసింహస్వామి, సురేష్, సతీష్, అధ్యాపకేతర సిబ్బంది రహీం, మంజులత, పారిజాతమ్మ తదితరులు పాల్గొన్నారు.